
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో ఇవాళ (అక్టోబర్ 23) జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో (Bangladesh vs West Indies) బంగ్లాదేశ్ ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది.
ఓపెనర్లు సైఫ్ హసన్ (80), సౌమ్య సర్కార్ (91) సెంచరీలకు చేరువగా వచ్చి ఔటయ్యారు. మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేసిన తౌహిద్ హృదోయ్ (28), నజ్ముల్ హసన్ షాంటో (44) కూడా పర్వాలేదనిపించారు. అయితే ఆతర్వాత వచ్చిన వారు పెద్దగా రాణించకపోవడంతో బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేయలేకపోయింది.
ఓ దశలో సునాయాసంగా 350 పరుగులు చేస్తుందనుకున్న జట్టు మిడిలార్డర్ వైఫల్యం కారణంగా 300లోపే పరిమితమైంది. మిడిలార్డర్ బ్యాటర్లు మహిదుల్ ఇస్లాం 6, రిషద్ హొసేన్ 3, నసుమ్ అహ్మద్ 1 పరుగుకు ఔటయ్యారు.
ఆఖర్లో నురుల్ హసన్ (16 నాటౌట్), కెప్టెన్ మెహిది హసన్ (17) ఓ మోస్తరుగా బ్యాట్ ఝులిపించడంతో బంగ్లాదేశ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
తొలుత తడబడిన విండీస్ బౌలర్లు ఆఖర్లో అనూహ్యంగా పుంజుకొని బంగ్లాను 300లోపే కట్టడి చేశారు. అకీల్ హోసేన్ 4, అలిక్ అథనాజ్ 2, రోస్టన్ ఛేజ్, మోటీ తలో వికెట్ తీసి, బంగ్లాను భారీ స్కోర్ చేయకుండా నియంత్రించారు.
కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి వన్డేలో బంగ్లాదేశ్, రెండో వన్డేలో వెస్టిండీస్ (సూపర్ ఓవర్) గెలిచాయి. ఈ సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా జరుగనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 27, 29, 31 తేదీల్లో చట్టోగ్రామ్ వేదికగా జరుగుతుంది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం వెస్టిండీస్ బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది.