ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20) 2025-26 సీజన్‌కు ముందు అబుదాబి నైట్ రైడర్స్ (ABKR) కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్‌గా వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్‌ను నైట్ రైడర్స్ యాజమాన్యం నియమించింది. గత సీజన్ వరకు కెప్టెన్‌గా కొనసాగిన సునీల్ నరైన్ స్ధానాన్ని హోల్డర్ భర్తీ చేయనున్నాడు.
ఈ విషయాన్ని అబుదాబి ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. హోల్డర్ గతేడాది సీజన్‌లోనే నైట్ రైడర్స్ జట్టులో చేరాడు. ఇప్పుడు ఏకంగా కెప్టెన్‌గా జాక్ పాట్ కొట్టేశాడు. గత సీజన్‌లో నైట్‌రైడర్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్దానంలో నిలిచినప్పటికి.. హెల్డర్ మాత్రం తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు.
అందుకే నరైన్‌పై వేటు..
కాగా సునీల్ నరైన్ కెప్టెన్సీలో అంచనాలకు తగ్గట్టుగా జట్టు రాణించికపోవడం వల్లే నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ ఈ కీలక మార్పు చేసినట్లు తెలుస్తోంది. మూడు సీజన్‌ల పాటు అబుదాబి నైట్ రైడర్స్ కెప్టెన్‌గా నరైన్ వ్యవహరించాడు. ఈ మూడు సీజన్లలోనూ ఎబీకేర్ లీగ్ స్టేజికే పరిమితమైంది.
దీంతో హోల్డర్‌కు విండీస్ కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉండడంతో తమ జట్టు పగ్గాలను ఎబీకేర్ అప్పగించింది. హోల్డర్ సారథ్యంలోనైనా ఆ జట్టు తలరాత మారుతుందో లేదో చూడాలి. నైట్‌రైడర్స్ జట్టులో ఆండ్రీ రస్సెల్, లియామ్ లివింగ్‌స్టోన్, ఫిల్ సాల్ట్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. కాగా అబుదాబి నైట్ రైడర్స్.. ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్ సిస్టర్ ఫ్రాంచైజీ కావడం గమనార్హం. ఈ టోర్నమెంట్ డిసెంబర్ 2 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! ఆ కోపం అక్కడ చూపించేస్తున్నాడు


