
స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో, నిర్ణయాత్మక మూడో టీ20కి ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. కంకషన్ (తలకు బలమైన దెబ్బ) కారణంగా విధ్వంసకర బ్యాటర్ మిచెల్ ఓవెన్ తదుపరి సిరీస్ మొత్తానికి (ఓ టీ20, మూడు వన్డేలు) దూరమయ్యాడు.
రెండో టీ20 సందర్భంగా ఓవెన్‌కు గాయమైంది. బౌలర్ సంధించిన బంతి అతడి హెల్మెట్ గ్రిల్‌పై బలంగా తాకింది. వెంటనే జరిపిన కంకషన్ పరీక్షల్లో గాయం తాలుకా లక్షణాలు కనిపించనప్పటికీ.. నెమ్మదిగా దాని ప్రభావం బయటపడింది. మ్యాచ్ ముగిసిన తర్వాతి రోజు ఓవెన్ తీవ్ర అసౌకర్యానికి లోనయ్యాడు. డాక్టర్లను సంప్రదించగా.. మ్యాచ్ సందర్భంగా తగిలిన గాయం ఎఫెక్ట్ అని తేల్చారు. 12 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
ఈ మధ్యలో ఆసీస్ సౌతాఫ్రికాతో చివరి టీ20, ఆతర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడేస్తుంది. వాస్తవానికి ఈ సిరీస్‌తో ఓవెన్ వన్డే అరంగేట్రం చేయాల్సి ఉండింది. అయితే ఈ గాయం ఓవెన్ వన్డే ఎంట్రీని పోస్ట్ పోన్ చేసింది.
23 ఏళ్ల ఓవెన్ పొట్టి క్రికెట్‌లో నయా సంచలనంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గత బిగ్‌బాష్ లీగ్ ఫైనల్లో విధ్వంసకర శతకం బాది వార్తల్లోకెక్కిన ఓవెన్.. ఆతర్వాత ఐపీఎల్, జాతీయ జట్టుకు ఆడే అవకాశాలు దక్కించుకున్నాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఒకే ఒక మ్యాచ్ ఆడిన ఓవెన్ అందులో విఫలమయ్యాడు.
ఓవెన్ అంతర్జాతీయ అరంగేట్రం మాత్రం ఘనంగా జరిగింది. విండీస్‌తో మ్యాచ్‌లో అతను 27 బంతుల్లో 6 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. మీడియం పేస్ బౌలర్ కూడా అయిన ఓవెన్ ఆ మ్యాచ్‌లో ఓ వికెట్ కూడా తీశాడు.తద్వారా అంతర్జాతీయ టీ20 అరంగేట్రంలో హాఫ్ సెంచరీతో పాటు వికెట్ తీసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
కాగా, సౌతాఫ్రికాతో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టును గాయాల బెడద వేధిస్తుంది. ఓవెన్‌తో పాటు మరో ఇద్దరు కూడా ఈ సిరీస్‌కు దూరమయ్యారు. టీ20, వన్డే జట్లకు ఎంపికైన మ్యాట్ షార్ట్ విండీస్ సిరీస్ సందర్భంగా తగిలిన గాయం నుంచి పూర్తిగా కోలుకోలేక జట్టు నుంచి వైదొలిగాడు. వన్డే జట్టులో ఉన్న లాన్స్ మోరిస్ వెన్ను సమస్య కారణంగా జట్టుకు దూరమయ్యాడు.
షార్ట్, మోరిస్ స్థానాల్లో ఆరోన్ హార్డీ, మాథ్యూ కుహ్నేమన్ వన్డే జట్టులోకి వచ్చారు. వీరిద్దరు ఇదివరకే టీ20 జట్టులో ఉన్నారు. మరోవైపు జ్వరం కారణంగా రెండో టీ20కి దూరమైన వికెట్‌కీపర్ బ్యాటర్ జోస్ ఇంగ్లిస్ మూడో టీ20కి సిద్దమయ్యాడు.
మూడో టీ20 ఆగస్ట్ 16న జరుగనుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆసీస్, రెండో మ్యాచ్ సౌతాఫ్రికా గెలిచాయి. టీ20 సిరీస్ తర్వాత ఆగస్ట్ 19, 22, 24 తేదీల్లో వన్డేలు జరుగనున్నాయి. ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది.