
భారత్, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో వింత దృశ్యాలు కనిపించాయి. మైదానంలో ఆటగాళ్లపై లేడీబర్డ్స్ (ఆరుద్ర పరుగులు) దాడి చేశాయి. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు చాలా అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ ఘటన ఇన్నింగ్స్ 81వ ఓవర్‌లో చోటు చేసుకుంది.
ఆకాశ్‌దీప్ నాలుగో బంతి పూర్తి చేశాక, లేడీబర్డ్స్ ఒక్కసారిగా మైదానాన్ని ఆవహించాయి. అప్పటికీ క్రీజ్‌లో ఉన్న స్టోక్స్, రూట్‌ను కూడా ఇబ్బంది పెట్టాడు. ఈ పురుగులు స్టోక్స్ హెల్మెట్‌లోకి కూడా ప్రవేశించాయి. స్టోక్స్ కాసేపు అసహనానికి గురయ్యాడు. ఈ పురుగుల దండయాత్ర కారణంగా మ్యాచ్ కొద్దిసేపు ఆగిపోయింది. తిరిగి అవి వెళ్లిపోయాక మ్యాచ్ యధాతథంగా కొనసాగింది.
ఈ ఘటన తర్వాత రెండు ఓవర్లకే తొలి రోజు ఆట పూర్తియ్యింది. రూట్ 99, స్టోక్స్ 39 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. లేడీబర్డ్స్ ఆటగాళ్లపై దాడి చేసిన దృశ్యాలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో మ్యాచ్‌లు జరుగుతుండగా తేనెటీగలు, పాములు, పక్షులు మ్యాచ్‌కు అంతరయాన్ని కలిగించడం చూశాం. కానీ లేడీబర్డ్స్ దాడి చేయడం ఇదే మొదటిసారి. లండన్‌లో ఈ సీజన్‌లో మైదాన ప్రాంతాల్లో లేడీబర్డ్స్ గుంపులుగా తిరుగుతుంటాయి. అయితే జనావాసాల్లో రావడం చాలా అరుదని అక్కడి జనాలు అంటున్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆట హోరాహోరీగా సాగింది. ఇరు జట్ల ఆటగాళ్లు సెడ్జింగ్‌తో ఒకరినొకరు కవ్వించుకున్నారు. అయితే అంతిమంగా జో రూట్ పైచేయి సాధించాడు. తొలి రోజు ఇంగ్లండ్ తమ బజ్‌బాల్ కాన్సెప్ట్‌ను పక్కన పెట్టి క్రీజ్‌లో కుదురుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చింది. రూట్, స్టోక్స్ చాలా సహనంగా బ్యాటింగ్ చేశారు.
టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్‌కు నితీశ్ కుమార్ రెడ్డి ఆదిలోనే వరుస బ్రేక్‌లిచ్చాడు. నితీశ్ 14వ ఓవర్‌లో ఇంగ్లండ్ ఓపెనర్లిద్దరీ పెవిలియన్‌కు పంపాడు. ఆతర్వాత పోప్, రూట్ కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించారు. ఈ దశలో రవీంద్ర జడేజా ఓ అద్భుతమైన బంతితో పోప్ ఆట కట్టించాడు. ఆతర్వాత కొద్ది సేపటికే బుమ్రా వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ పని పట్టాడు. బుమ్రా బ్రూక్‌ను కళ్లు చెదిరే బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు (83 ఓవర్లలో) చేసింది. జో రూట్ 99 (191 బంతుల్లో 9 ఫోర్లు), కెప్టెన్ బెన్ స్టోక్స్ 39 పరుగులతో (102 బంతుల్లో 2 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే 18, బెన్ డకెట్ 23, ఓలీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి 2, బుమ్రా, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.
తొలి రోజు రూట్ తన అత్యుత్తమ ప్రదర్శనతో పలు రికార్డులు సాధించాడు. 33 పరుగుల వద్ద భారత్‌పై అన్ని ఫార్మాట్లలో 4000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 45 పరుగుల వద్ద భారత్‌పై టెస్ట్‌ల్లో 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 99 పరుగుల స్కోర్ వద్ద ఇంగ్లండ్‌లో 7000 టెస్ట్ పరుగులు పూర్తి చేసుకున్నాడు. తొలి ఫోర్‌తో టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ తరఫున 800 ఫోర్లు పూర్తి చేసుకున్నాడు.
కాగా, ఈ సిరీస్‌లో ఇంగ్లండ్, భారత్ తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్ట్‌లో భారత్ భారీ విజయం సాధించింది.