Big Bash League: సిడ్నీ థండర్‌ 15 ఆలౌట్‌!

Big Bash League: Sydney Thunder Bowled Out For 15 Runs In Big Bash League Match Against Adelaide Strikers - Sakshi

టి20ల్లో అత్యల్ప స్కోరు నమోదు

సిడ్నీ: 0 0 3 0 2 1 1 0 0 4 1... ఇవీ ఒక టి20 మ్యాచ్‌లో వరుసగా 11 మంది ఆటగాళ్ల స్కోర్లు!  ప్రతిష్టాత్మక బిగ్‌బాష్‌ లీగ్‌...ఐపీఎల్‌ తర్వాత అత్యంత ప్రజాదరణ ఉన్న టి20 టోర్నీ...ఇప్పటికే ఒక సారి చాంపియన్‌గా నిలిచిన సిడ్నీ థండర్‌ జట్టు... కానీ అత్యంత చెత్త ప్రదర్శనతో ఆ జట్టు టి20 చరిత్రలో తలదించుకునే రికార్డు నమోదు చేసింది. శుక్రవారం అడిలైడ్‌ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్‌ 5.5 ఓవర్లలో 15 పరుగులకే కుప్పకూలింది. ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోగా, ఎక్స్‌ట్రాల రూపంలో 3 పరుగులు వచ్చా యి.

టి20 ఫార్మాట్‌లో విధ్వంసక ఆటగాళ్ల జాబి తాలో నిలిచే అలెక్స్‌ హేల్స్, రిలీ రోసో సిడ్నీ జట్టు లో ఉన్నారు. కనీసం ఒక్క ఆటగాడు కూడా పరిస్థితిని బట్టి నిలబడేందుకు గానీ, కౌంటర్‌ అటాక్‌తో పరుగులు రాబట్టేందుకు గానీ ప్రయత్నించలేదు. దాంతో 35 బంతుల్లోనే జట్టు ఇన్నింగ్స్‌ ముగిసింది. పదో నంబర్‌ బ్యాటర్‌ డాగెట్‌ బ్యాట్‌కు ఎడ్జ్‌ తీసుకొని ఒకే ఒక ఫోర్‌ రాగా... స్టేడియంలో ప్రేక్షకులంతా నిలబడి వ్యంగ్యంగా ‘స్టాండింగ్‌ ఒవేషన్‌’ ఇవ్వ డం పరిస్థితిని చూపిస్తోంది! 17 బంతుల్లో 3 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టిన అడిలైడ్‌ పేసర్‌ హెన్రీ థార్టన్‌ సిడ్నీ పతనంలో కీలక పాత్ర పోషించాడు. వెస్‌ అగర్‌ 12 బంతుల్లో 6 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అంతకు ముందు 139 పరుగులు చేసిన స్ట్రైకర్స్‌ 124 పరుగులతో మ్యాచ్‌
గెలుచుకుంది.  

15: టి20 క్రికెట్‌లో ఇదే అత్యల్ప స్కోరు. 2019లో కాంటినెంటల్‌ కప్‌లో భాగంగా చెక్‌ రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌లో టర్కీ 21 పరుగులకే ఆలౌటైన రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. అతి తక్కువ బంతులు (35) సాగిన ఇన్నింగ్స్‌ కూడా ఇదే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top