Pat Cummins: ఉన్నపళంగా స్వదేశానికి ఆసీస్‌ కెప్టెన్‌..

BGT 2023: AUS Captain Pat Cummins Flies Back Home-Personal Reasons - Sakshi

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే వరుసగా రెండు టెస్టులు ఓడి షాక్‌లో ఉన్న ఆసీస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ సోమవారం ఉన్నపళంగా స్వదేశానికి బయలుదేరాడు. ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం కారణంగానే కమిన్స్‌ సిడ్నీకి బయలుదేరినట్లు తెలిసింది. ఈ విషయాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా సోమవారం ఉదయం ట్విటర్‌లో పేర్కొంది.

అయితే మూడో టెస్టు మొదలయ్యేలోగా కమిన్స్‌ తిరిగి వస్తాడని ఆసీస్‌ క్రికెట్‌ తెలిపింది. రెండో టెస్టు రెండున్నర రోజుల్లోనే ముగియడంతో కమిన్స్‌ తన పర్సనల్‌ వ్యవహారమై స్వదేశానికి వెళ్లి రావాలని నిశ్చయించుకున్నాడు. ఒకవేళ రెండో టెస్టు ఐదు రోజులు జరిగినప్పటికి ఆ తర్వాత అయిన కమిన్స్‌ వెళ్లేవాడే. అయితే మూడో టెస్టుకు మాత్రం దూరమయ్యేవాడు. ఇప్పుడు ఆ అవసరం కూడా లేకుండా పోయింది. ఒకవేళ కమిన్స్‌ రాలేని పరిస్థితి ఉంటే అప్పుడు జట్టును వైస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ నడిపించే అవకాశం ఉంది. అయితే మూడో టెస్టు మార్చి 1నుంచి ఇండోర్‌ వేదికగా జరగనుంది. మ్యా్చ్‌కు దాదాపు పది రోజులు సమయం ఉండడంతో కమిన్స్‌ తిరిగివచ్చి జట్టుతో కలిసే అవకాశం ఉంది. 

ఇక కమిన్స్‌ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టుకు భారత గడ్డపై ఏదీ కలిసి రావడం లేదు. తొలి రెండు టెస్టుల్లో స్నిన్నర్లను ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమైన ఆస్ట్రేలియా రెండున్నర రోజుల్లోనే తమ ఆటను ముగించింది. అంతేకాదు టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకున్నట్లు కనిపించిన ఆస్ట్రేలియాకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది.

ఒకవేళ​ టీమిండియాతో సిరీస్‌లో ఆసీస్‌ గనుక క్లీన్‌స్వీప్‌ అయితే ఆ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడకపోవచ్చు. ఆసీస్‌ స్థానంలో ఇంగ్లండ్‌, శ్రీలంక, సౌతాఫ్రికాలలో ఏదో ఒక జట్టుకు అవకాశం ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడాలనుకుంటే మాత్రం ఆసీస్‌ తన తర్వాతి రెండు టెస్టులను కనీసం డ్రా అయినా చేసుకోవాల్సిందే. 

చదవండి: పిచ్‌పై నీలాపనిందలు.. ఆడడం చేతగాకనే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top