పిచ్‌పై నీలాపనిందలు.. ఆడడం చేతగాకనే

Gavaskar Counter Australia Cricket Pitch Condition-Team-India Favour  - Sakshi

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా టీమిండియతో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించింది. జడేజా, అశ్విన్‌లు తమ స్పిన్‌ మాయాజాలంతో ఆసీస్‌ వెన్నులో వణుకు పుట్టించారు. అయితే పిచ్‌లు భారత స్పిన్నర్లకు అనుకూలంగా తయారు చేయడం వల్లే ఓడిపోతున్నామని మళ్లీ పాత పాటే పాడారు. ఆడడం చేతగాక పిచ్‌పై నీలాపనిందలు వేస్తున్నారు కంగారూలు.
-సాక్షి, వెబ్‌డెస్క్‌

నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ ఆసీస్‌ కథ రెండున్నర రోజుల్లోనే ముగిసింది. తాజాగా ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయింది. అయితే తొలి టెస్టుతో పోలిస్తే.. ఢిల్లీ టెస్టులో ఆసీస్‌ బ్యాటింగ్‌ కొంత నయం అనిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 263 పరుగులు.. ఆ తర్వాత భారత్‌ను 262 పరుగులకు ఆలౌట్‌ చేసి.. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 61/1తో పటిష్టంగా కనిపించినప్పుడు ఆస్ట్రేలియాకు పిచ్‌ గురించి కానీ.. భారత్‌ స్పిన్‌ నొప్పి తెలియలేదు. అయితే కేవలం 52 పరుగుల తేడాతో మిగతా 9 వికెట్లు చేజార్చుకొని 113 పరుగులకు ఆలౌట్‌ కాగానే మా ఓటమికి కారణం పిచ్‌లేనంటూ అసహనం వ్యక్తం చేశారు. టీమిండియాకు అనుకూలంగా పిచ్‌లు తయారు చేయడంతోనే తాము ఓడిపోతున్నామంటూ పెడబొబ్బలు పెడుతున్నారు.

వాస్తవానికి ఏ దేశంలో అయినా ఆతిథ్య జట్టుకు అనుకూలంగానే పిచ్‌లు ఉంటాయన్నది బహిర్గతం. అయితే ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా లాంటి పిచ్‌లు కాస్త ప్రతికూలంగా ఉంటాయి. తేమ ఎక్కువగా ఉండడంతో అక్కడి పిచ్‌లపై పేసర్లు వికెట్ల పండగ చేసుకుంటారు. ఇటీవలే ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలు కూడా పిచ్‌లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయని తెలిసింది. దీనికి బ్రిస్బేన్‌లో ఆసీస్‌-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌ నిదర్శనం. పట్టుమని రెండు రోజులు కూడా సరిగ్గా మ్యాచ్‌ జరగలేదు. ఇరుజట్లు కలిపి 143 ఓవర్లలో నాలుగు ఇన్నింగ్స్‌లు ఆడేశాయంటే అక్కడి పిచ్‌లు ఆసీస్‌కు ఎంత అనుకూలంగా ఉన్నాయనేది చూపించింది. మరి అప్పుడు లేవని 'అనుకూల పిచ్‌' నోర్లు.. ఇప్పుడు టీమిండియాతో ఓటమి పాలవ్వగానే లేస్తున్నాయి.

భారత గడ్డపై అడుగుపెట్టగానే స్పిన్‌ పిచ్‌లపై కఠిన పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని ఆసీస్‌ భావించింది. అందుకోసం బెంగుళూరులోని ఒక క్రికెట్‌ స్టేడియంలో అశ్విన్‌ను పోలిన బౌలర్‌ మహేష్‌ పితియాతో గంటల తరబడి బౌలింగ్‌ చేయించుకొని ప్రాక్టీస్‌ చేశారు. కేవలం ప్రాక్టీస్‌తోనే తమకు స్పిన్‌ ఆడడం వచ్చేసిందనే భ్రమలో ఉండిపోయారు ఆసీస్‌ ఆటగాళ్లు. కానీ క్రీజులోకి వచ్చాకా అశ్విన్‌, జడేజాల బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియకు తలలు పట్టుకుంటున్నారు. ఇక ఢిల్లీ టెస్టులో ఆసీస్‌ బ్యాటర్లు ఎక్కువగా వికెట్లు పారేసుకుంది స్వీప్‌, రివర్స్‌స్వీప్‌ షాట్లతోనే. జడేజా తెలివిగా లోబాల్స్‌ వేస్తు‍న్నప్పటికి దానిని అర్థం చేసుకోలేని ఆసీస్‌ ఆటగాళ్లు అర్థం పర్థం లేని షాట్లు ఆడుతూ వికెట్లు పారేసుకున్నారు. 

పిచ్‌ తమ ఓటములకు కారణమని చెప్పుకుంటున్న ఆసీస్‌ క్రికెటర్లకు టీమిండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చాడు. ''ఉపఖండం పిచ్‌లపై స్పిన్‌ ఆడడం అంత తేలిక కాదు. టెస్టు క్రికెట్‌లో స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం బ్యాటర్లకు అతిపెద్ద సవాల్‌. స్పిన్‌ అనే అస్త్రం బ్యాట్స్‌మన్‌ ఫుట్‌వర్క్‌కు పరీక్ష పెడుతుంది. క్రీజును ఎలా ఉపయోగించుకోవాలో నేర్పుతుంది. అందుకే భారత్‌ లాంటి ఉపఖండపు పిచ్‌లపై సెంచరీ లేదా డబుల్‌ సెంచరీలు చేసిన వాళ్లను అత్యుత్తమ బ్యాటర్లుగా పరిగణిస్తారు.

ఇలా కొన్ని ప్రాథమిక సూత్రాలు మరిచిపోయి పిచ్‌పై నానా యాగీ చేయడం ఎంతవరకు కరెక్ట్‌. పిచ్‌లపై ఏడ్వడం మానేసి ముందు పరిస్థితులకు అలవాటు పడండి. స్పిన్‌ ఆడడం అంత తేలిక కాదన్న విషయం ఇప్పటికైనా అర్థమై ఉంటుంది. దమ్ముంటే స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నం చేయండి. ఆడడం చేతగాకపోతే ఎలా ఆడాలో నేర్చుకొండి.. ఇలాంటి అర్థరహిత వ్యాఖ్యలు మాత్రం చేయకండి'' అంటూ కౌంటర్‌ ఇచ్చాడు.

గతంలోనూ ఆస్ట్రేలియా టీమిండియా పర్యటనకు చాలాసార్లు వచ్చింది. నిజానికి అశ్విన్‌, జడేజాల కంటే ఉపఖండంలో మెరుగైన స్పిన్నర్లు చాలా మందే ఉన్నారు. కుంబ్లే, హర్బజన్‌, మురళీధరన్‌, బిషన్‌సింగ్‌ బేడీ, ప్రసన్న, ఆసీస్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌.. వీరంతా తమ స్పిన్‌ బౌలింగ్‌తో ముప్పతిప్పలు పెట్టినవారే. అంతెందుకు దిగ్గజం వార్న్‌ కూడా భారత్‌ పిచ్‌లపై చాలాసార్లు ప్రభావం చూపించాడు. ఇవాల్టికి అత్యుత్తమ స్పిన్నర్లుగా పేరున్న వార్న్‌, మురళీధరన్‌ బౌలింగ్‌ను సచిన్‌, ద్రవిడ్‌, లక్ష్మణ్‌లు ఎలా చీల్చి చెండాడారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మంచి ఫుట్‌వర్క్‌తో సరైన షాట్‌ సెలెక్షన్‌తో బంతిని బౌండరీలకు తరలిస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది. క్రీజు వదిలి వికెట్ల ముందుకొచ్చి డిఫెన్స్‌ ఆడొచ్చన్న టెక్నిక్‌ను ఇప్పటి బ్యాటర్లు పూర్తిగా మరిచిపోయారు. టి20 క్రికెట్‌ మోజులో పడి సంప్రదాయ క్రికెట్‌లోనూ అదే దూకుడు కనబరచాలని భావించి బొక్క బోర్లా పడుతున్నారు. రాబోయే మూడో టెస్టుకైనా ఆసీస్‌ పరిస్థితులకు అలవాటు పడల్సిందే. అలా కాకుండా పిచ్‌లపై అవగాహన లేకుండా ఇష్టారీతిలో స్వీప్‌, రివర్స్‌ స్వీప్‌ అంటూ అర్థరహిత షాట్లు ఆడితే ఢిల్లీ టెస్టు ఫలితమే మరోసారి పునరావృతమవుతుంది. అశ్విన్‌, జడేజాల బౌలింగ్‌ ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా కసరత్తేమీ అవసరం లేదు. సచిన్‌, ద్రవిడ్‌, లక్ష్మణ్‌, గావస్కర్‌, ఇయాన్‌ చాపెల్‌, డేవిడ్‌ గోవర్‌ లాంటి దిగ్గజాల బ్యాటింగ్‌ వీడియోలు చూస్తే స్పిన్‌ ఎలా ఆడాలనే దానిపై ఒక క్లారీటీ వస్తుంది.

చదవండి: పురుషులే అనుకున్నాం.. మహిళా క్రికెటర్లది అదే తీరు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top