అక్షరాలా రూ. 4,000 కోట్ల ఆదాయం!

BCCI earns a whopping INR 4000 crore by conducting IPL 2020 - Sakshi

ఐపీఎల్‌–2020తో బీసీసీఐ భారీ ఆర్జన

ముంబై: కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడలు ఆగిపోయాయి. కనీసం చిన్న స్థాయి టోర్నీ కూడా నిర్వహించలేని పరిస్థితి. మన దేశంలోనైతే రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో కూడా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2020లో కూడా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) నిర్వహణ గురించి ఆలోచించింది.

► సాధారణంగా ప్రతీ ఏటా నిర్వహించే ఏప్రిల్‌–మే షెడ్యూల్‌ సమయం గడిచిపోయినా ఆశలు కోల్పోలేదు. కోవిడ్‌–19 కాలంలో ఎన్నో కష్టాలకోర్చి క్రికెట్‌ నిర్వహించడం అవసరమా అని ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు.

► అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలన్నీ ఆలోచించి చివరకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో విజయవంతంగా ఐపీఎల్‌ను నిర్వహించింది. బీసీసీఐ ఎందుకు ఇంతగా శ్రమించిందో తాజా లెక్కలు చూస్తే అర్థమవుతుంది.  

► ఐపీఎల్‌–13 సీజన్‌ ద్వారా భారత బోర్డుకు ఏకంగా రూ. 4 వేల కోట్ల ఆదాయం వచ్చింది. లీగ్‌ జరపకుండా ఉండే ఇంత భారీ మొత్తాన్ని బోర్డు కోల్పోయేదేమో! తాజా సీజన్‌ ఐపీఎల్‌ను టీవీలో వీక్షించినవారి సంఖ్య గత ఏడాదికంటే 25 శాతం ఎక్కువగా ఉండటం విశేషం. –మరోవైపు ఐపీఎల్‌ సాగిన కాలంలో బోర్డు మొత్తంగా 1800 మందికి 30 వేల (ఆర్టీ–పీసీఆర్‌) కరోనా పరీక్షలు నిర్వహించడం మరో విశేషం.  

ఖర్చులు తగ్గించుకొని...
సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు ఎలాంటి అంతరాయం లేకుండా జరిగిన 60 మ్యాచ్‌ల ఐపీఎల్‌ నిర్వహణకు సంబంధించి బోర్డు కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
 
► ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌కు దాదాపు రెండు నెలల ముందు ఎగ్జిబిషన్‌ టోర్నీ సమయంలో వరల్డ్‌ నంబర్‌వన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ జొకోవిచ్‌కు కరోనా రావడంతో మా లీగ్‌ నిర్వహణపై కూడా సందేహాలు కనిపించాయి. చాలా మంది మమ్మల్ని ముందుకు వెళ్లవద్దని వారించారు. ఎవరైనా క్రికెటర్‌కు కరోనా వస్తే ఎలా అని వారు అడిగారు. అయితే మేం వాటిని పట్టించుకోలేదు. ∙గత ఐపీఎల్‌తో పోలిస్తే బీసీసీఐ 35 శాతం నిర్వహణా ఖర్చులు తగ్గించుకుంది. నిర్వహణకు శ్రీలంక నుంచి కూడా ప్రతిపాదన వచ్చినా యూఏఐ వైపు మొగ్గు చూపాం. మూడు నగరాల మధ్యలో బస్సులో ప్రయాణించే అవకాశం ఉండటంతో అలా కూడా ఖర్చు తగ్గించాం.  

► సుమారు 40 సార్లు కాన్ఫరెన్స్‌ కాల్స్‌ ద్వారా గంటలకొద్దీ చర్చలు సాగాయి. బయో సెక్యూర్‌ బబుల్‌ కోసం రెస్ట్రాటా అనే కంపెనీ సహకారం తీసుకున్నాం. బీసీసీఐ అధికారులు ముందుగా వెళ్లి ఐపీఎల్‌ ఫ్రాంచైజీల కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. క్వారంటైన్‌ విషయంలో దుబాయ్‌ ప్రభుత్వం ఆటగాళ్లకు సడలింపులు ఇచ్చినా... యూఏఈ ప్రభుత్వం ససేమిరా అంది. చివరకు ఎంతో శ్రమించి వారిని కూడా ఒప్పించగలిగాం. ఇంత చేసినా ఆరంభంలోనే చెన్నై బృందంలో చాలా మందికి కరోనా వచ్చినట్లు తేలడంలో ఆందోళన కలిగింది. అయితే ఆ తర్వాత అంతా కోలుకున్నారు. మొత్తంగా యూఏఈ ప్రభుత్వ సహకారంతో లీగ్‌ సూపర్‌ హిట్‌ కావడం సంతోషకరం. చివరకు మాకు రూ. 4 వేల కోట్ల ఆదాయం కూడా వచ్చింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top