T20 WC 2022: బాబర్‌ కుడివైపు, బట్లర్‌ ఎడమవైపు.. అయితే పాక్‌దే కప్‌

Babar Azam Stands Right Side ICC T20 WC Trophy Fans-Says Pak Win-Title - Sakshi

సెంటిమెంట్స్‌ను నమ్ముకొని ఆటలు ఆడితే కప్పులు రావు.. ఆరోజు మ్యాచ్‌లో ఎవరు బాగా రాణిస్తే వారినే విజయం వరిస్తుంది. అంతేకానీ ఆడడం మానేసి సెంటిమెంట్‌ను ఎక్కువగా నమ్ముకొని బరిలోకి దిగితే మొదటికే మోసం వస్తుంది. కానీ కొన్నిసార్లు ఆ సెంటిమెంట్లు కూడా నమ్మాల్సి వస్తుంది. ఒక్కోసారి పరిస్థితులు కూడా అందుకు తగ్గట్లే ఉంటాయి. తాజాగా మనం చెప్పుకునేది కూడా ఆ కోవలోకే వస్తుంది.

టి20 ప్రపంచకప్‌లో భాగంగా నవంబర్‌ 13న(ఆదివారం) ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఫైనల్లో ఇంగ్లండ్‌ ఫేవరెట్‌గా కనిపిస్తున్నప్పటికి పాక్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ విషయం పక్కనబెడితే ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడనున్న ఇరుజట్ల కెప్టెన్లు ట్రోఫీ పక్కన నిలబడి ఫోటోకు ఫోజివ్వడం ఆనవాయితీగా వస్తుంది. 2019 నుంచి ఐసీసీ ట్రోఫీకి కుడిపక్కన నిలబడిన కెప్టెన్లు టైటిల్స్‌ గెలుస్తూ వస్తున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం.

తాజాగా ఫైనల్ మ్యాచ్‌కి ముందు ట్రోఫీతో ఫైనలిస్టులు ఫోటోలు దిగారు. కుడి వైపు బాబర్ ఆజం నిలబడగా.. ఎడమవైపు ఇంగ్లండ్‌ కెప్టెన్ జాస్ బట్లర్ ఎడమవైపు నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చారు. సెంటిమెంట్ ప్రకారం ట్రోఫీకి కుడిపక్కన బాబర్‌ ఆజం నిలబడడంతో ఈసారి పాక్ టి20 వరల్డ్‌కప్‌ కొట్టబోతుందని అభిమానులు బలంగా పేర్కొన్నారు.

ఇంతకముందు 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కుడి వైపు నిలబడగా.. ఎడమవైపు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ నిలబడ్డాడు. కుడివైపు నిలబడిన ఇంగ్లండ్‌కు సూపర్ ఓవర్‌లో 'సూపర్' విజయం దక్కింది. ఇక 2021 టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ కుడివైపు నిలబడగా.. కేన్‌ విలియమ్సన్‌ మాత్రం మళ్లీ ఎడమవైపే నిలబడ్డాడు. ఈసారి కూడా కుడివైపు నిల్చొన్న ఆరోన్ ఫించ్ సేనకే వరల్డ్ కప్ దక్కింది.

ఐసీసీ 2021లో తొలిసారి నిర్వహించిన టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లోనూ ఇదే సీన్‌ రిపీట్‌ అయింది. ఈసారి న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ కుడివైపు నిలబడగా.. అప్పటి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఎడమవైపు ఉన్నాడు. దీంతో దాదాపు 21 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌ జట్టు ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

ఈ అంశాలన్ని పరిగణలోకి తీసుకొని చేస్తే ట్రోఫీకి కుడివైపు నిలబడిన బాబర్ ఆజం జట్టు కప్‌ గెలవబోతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. అయితే చాలా మంది అభిమానులు బలంగా నమ్ముతున్న మరో సెంటిమెంట్‌ను కూడా బలంగా నమ్ముతున్నారు. అదేంటంటే 1992 వన్డే వరల్డ్‌కప్‌. అప్పటి ఇమ్రాన్‌ నాయకత్వంలోని జట్టు.. ఇప్పటి బాబర్‌ ఆజం సేన దాదాపు ఒకేలాగా సెమీస్‌కు చేరుకున్నాయి. ఇక సెమీఫైనల్లో అద్భుత ఆటతీరు కనబరిచిన పాకిస్తాన్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. 1992 లాగే ఇప్పుడు కూడా పాకిస్తాన్‌ ఇంగ్లండ్‌తో అమితుమీ తేల్చుకోనుంది. మరి పైన చెప్పుకున్నట్లు ట్రోఫీకి కుడిపక్కన నిల్చున్న బాబర్‌ ఆజం కప్‌ కొట్టనున్నాడా లేదా అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. 

చదవండి: సూపర్‌-12లో వెళ్లాల్సినోళ్లు ఫైనల్‌ దాకా.. హేడెన్‌ చలవేనా!

T20 WC 2022: ఫైనల్లో పాక్‌ గెలిస్తే, బాబర్‌ ఆజమ్‌ ప్రధాని అవుతాడు..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top