Matthew Hayden: సూపర్‌-12లో వెళ్లాల్సినోళ్లు ఫైనల్‌ దాకా.. హేడెన్‌ చలవేనా!

Positive Vibes-Over-Tactics Hayden Becomes Big-Impact On PAK T20 WC - Sakshi

టి20 ప్రపంచకప్‌ 2022 నవంబర్‌ 13న ముగియనుంది. ఈ ఆదివారం జరగనున్న ఫైనల్లో ఇంగ్లండ్‌తో పాకిస్తాన్‌ అమితుమీ తేల్చుకోనుంది. సూపర్‌-12 దశలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి.. దీంతో పాక్‌ కథ ముగిసినట్లే అనుకున్నారంతా. కానీ వారికి ఎక్కడో సుడి రాసిపెట్టుంది. అందుకే ఆ తర్వాత పాక్‌ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో వరుసగా గెలవడం.. ఆపై సౌతాఫ్రికా నెదర్లాండ్స్‌ చేతిలో ఓడిపోవడంతో కథ అడ్డం తిరిగింది.

అనూహ్యంగా పాకిస్తాన్‌ సెమీస్‌లో అడుగుపెట్టింది. అయితే కీలకమైన సెమీస్‌లో మాత్రం అద్భుత ఆటతీరును కనబరిచింది. సూపర్‌-12 వరకు కిందా మీదా పడి ఎలాగోలా గెలిచిన పాకిస్తాన్‌ జట్టేనా సెమీస్‌లో కివీస్‌పై నెగ్గింది అన్న అనుమానాలు వచ్చాయి. మరి రెండు రోజుల వ్యవధిలో పాక్‌ జట్టులో అంత మార్పు ఎక్కడి నుంచి వచ్చిందనేది ఆసక్తికరంగా మారింది. 

అయితే దీనికి కారణం మాత్రం ఆసీస్‌ దిగ్గజం మాథ్యూ హేడెన్‌ అని క్రీడా పండితులు పేర్కొన్నారు. ప్రస్తుతం మాథ్యూ హెడెన్‌ పాకిస్తాన్‌ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. పాక్‌ దశను మార్చే పనిలో ఉన్న హేడెన్‌ దాదాపు సక్సెస్‌ అయినట్లే. ఇక ఫైనల్లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి పాకిస్తాన్‌ విజేతగా నిలిస్తే హేడెన్‌ తన పాత్రకు పూర్తి న్యాయం చేసినట్లే. 

ఇదంతా ఎందుకు.. అసలు ఆస్ట్రేలియాలోని పిచ్‌లపై పూర్తి అవగాహన ఉన్న ఆ దేశ మాజీ క్రికెటర్‌ను ఎప్పుడైతే మెంటార్‌గా ఏంచుకుందో అప్పుడే పాక్‌ సగం సక్సెస్‌ అయినట్లే. అయితే హేడెన్‌ ప్రభావం తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టింది.. అది కీలకమైన సెమీస్‌ మ్యాచ్‌లో. నిజానికి గతేడాది టి0 ప్రపంచకప్‌కు ముందే అంటే సెప్టెంబర్‌లోనే మాథ్యూ హెడెన్‌ను బ్యాటింగ్‌ కోచ్‌గా నియమించుకుంది. కానీ ఆ ప్రపంచకప్‌లో సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.

ప్రధాన కోచ్‌ అంటే అన్ని విషయాలు పరిశీలిస్తాడు. అదే బౌలింగ్‌ లేదా బ్యాటింగ్‌ కోచ్‌ అయితే కేవలం వారి పరిధి వరకే పనిచేస్తారు. ప్రస్తుతం పాక్‌ ప్రధాన కోచ్‌గా సక్లెయిన్‌ ముస్తాక్‌ ఉన్నాడు.  పీసీబీ ఎంపిక చేసింది కాబట్టి ఏం చేయలేని పరిస్థితి. ఇటు చూస్తే ఈసారి ప్రపంచకప్‌ జరుగుతుంది ఆస్ట్రేలియాలో.బ్యాటింగ్‌ కోచ్‌గా ఉన్న హేడెన్‌కు ఆసీస్‌ పిచ్‌లపై అపార అనుభవం ఉంది. అందుకే ఉన్నపళంగా మాథ్యూ హేడెన్‌ను మెంటార్‌గా నియమించిన పీసీబీ మహ్మద్‌ యూసఫ్‌ను బ్యాటింగ్‌ కోచ్‌గా ఎన్నుకుంది.

హేడెన్‌ అనుభవాన్ని పాకిస్తాన్‌ చక్కగా ఉపయోగించుకుందనడానికి సెమీస్‌ మ్యాచ్‌ ఉదాహరణ. ముందు బౌలింగ్‌తో కివీస్‌ను కట్టడి చేయగా.. ఆ తర్వాత అసలు ఫామ్‌లో లేని బాబర్‌ ఆజం, మహ్మద్‌ రిజ్వాన్‌లు అసలు మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీలతో మెరిసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. మరి వీటన్నింటి వెనుక కారణం హేడెన్‌ అంటే అతిశయోక్తి కాదు.

అందుకే మ్యాచ్‌ ముగియగానే హేడెన్‌ వద్దకు పరిగెత్తుకొచ్చిన పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం అతన్ని ప్రేమతో హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా బాగా వైరల్‌ అయ్యాయి. సూపర్‌-12 దశలో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం తమ జట్టు ముందుకు సాగుతుందా లేదా అని డైలమాలో ఉన్నాడు.. కానీ ఇదే సమయంలో హేడెన్‌ మాత్రం మా కుర్రాళ్లు తప్పుకుండా రాణిస్తారు.. ఈసారి కప్‌ పాకిస్తాన్‌దే అని ప్రతీ మ్యాచ్‌కు ముందు చెప్పుకుంటూ వస్తున్నాడు. హేడెన్‌ వ్యాఖ్యలని బట్టి చూస్తే పాక్‌ విజయంపై అతను ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో అర్థమవుతుంది.

ఇక పరిస్థితులు కూడా పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉన్నాయి. 1992 వన్డే వరల్డ్‌కప్‌లాగే ఇప్పుడు కూడా పాక్‌ టైటిల్‌ కొట్టబోతుంటూ పలువురు జోస్యం చెబుతున్నారు. అప్పుడు ఇమ్రాన్‌ ఖాన్‌ కెప్టెన్‌గా టైటిల్‌ గెలిచాడు. ఇప్పుడు బాబర్‌ ఆజం కెప్టెన్‌గా తొలి ఐసీసీ ట్రోఫీని అందుకోబోతున్నాడంటూ పేర్కొంటున్నారు. మరి హేడెన్‌ దిశానిర్ధేశం పాక్‌ జట్టుకు ఎంత వరకు పనిచేస్తుందనేది ఫైనల్‌ మ్యాచ్‌ పూర్తయ్యాకే తెలుస్తుంది. కాగా కివీస్‌పై గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాకా.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో హేడెన్‌ ఇచ్చిన స్పీచ్‌ను పీసీబీ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. 

ఈ జోస్యాల సంగతి పక్కనబెడితే టి20 క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. పాక్‌ సంగతి పక్కనబెడితే ఇంగ్లండ్‌ అంతకంటే బలంగా కనిపిస్తుంది. టీమిండియాతో సెమీస్‌లో ఇంగ్లండ్‌ ఆడిన ఆటతీరు చూస్తే అర్థమవుతుంది. కానీ పాక్‌ జట్టులో ప్రస్తుతం బౌలింగ్‌ విభాగం నెంబర్‌వన్‌గా ఉంది. షాహిన్‌ అఫ్రిది, మహ్మద్‌ వసీమ్‌, నసీమ్‌ షా పేస్‌ త్రయానికి తోడుగా మమ్మద్‌ నవాజ్‌ స్పిన్‌ కూడా పెద్ద బలం. మరి అరివీర భయంకరంగా కనిపిస్తున్న పాక్‌ పేసర్లను ఇంగ్లండ్‌ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం.

ఇవన్నీ పక్కనబెడితే క్రికెట్‌ అభిమానులు మాత్రం ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. కొందరేమో 1992 సీన్‌ రిపీట్‌ కాబోతుందని.. పాకిస్తాన్‌దే కప్‌ అని పేర్కొంటున్నారు. అయితే కొంతమంది మాత్రం పాక్‌కు అంత సీన్‌ లేదని.. మ్యాచ్‌ కచ్చితంగా వన్‌సైడ్‌ అవుతుందని.. ఇంగ్లండ్‌ రెండోసారి విశ్వవిజేతగా నిలవనుందని తెలిపారు.

చదవండి: కాలం ఒకేలా ఉండదు.. తిట్టినోడే చప్పట్లతో మెచ్చుకున్నాడు

ఆటలో లోపం లేదు.. టాలెంట్‌కు కొదువ లేదు.. ఎప్పుడు గుర్తిస్తారో!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top