Alex Hales-Eoin Morgan: కాలం ఒకేలా ఉండదు.. తిట్టినోడే చప్పట్లతో మెచ్చుకున్నాడు

Eoin Morgan Claps For Ales Hales Who-Hates Him Years Ago Viral - Sakshi

''ఎక్కడ పారేసుకున్నావో.. అక్కడే వెతుకు కచ్చితంగా దొరుకుతుంది'' అని మన పెద్దలు అనడం వింటూనే ఉంటాం. ఈ సారాంశం ఇంగ్లండ్‌ క్రికెటర్‌ అలెక్స్‌ హేల్స్‌కు సరిగ్గా సరిపోతుంది. టి20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం టీమిండియాతో జరిగిన కీలక సెమీఫైనల్లో కెప్టెన్‌ బట్లర్‌తో కలిసి విధ్వంసం సృష్టించాడు. 86 పరుగులు నాటౌట్‌గా నిలిచి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికైన అలెక్స్‌ హేల్స్‌ను టీమిండియా అభిమానులు అంత తొందరగా మరిచిపోలేరు.

అసలు విషయమేంటంటే ముందు అలెక్స్‌ హేల్స్‌ అసలు ఇంగ్లండ్‌ వరల్డ్‌కప్‌ జట్టులోనే లేడు. స్టార్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌ స్టో గాయపడడంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు అలెక్స్‌ హేల్స్‌. అయితే హేల్స్ జట్టులోకి రావడం వెనుక ఉన్నది మాత్రం ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జాస్‌ బట్లర్‌. బట్లర్‌ తనపై పెట్టుకున్న నమ్మకానికి అలెక్స్‌ హేల్స్‌ పూర్తిశాతం న్యాయం చేశాడు. ఈ టోర్నీలో నాలుగు ప్రధాన జట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, భారత్‌లతో జరిగిన మ్యాచ్‌లలో అతను 84, 52, 47, 86 నాటౌట్‌ పరుగులు సాధించి జట్టును ఫైనల్‌కు చేర్చాడు.

ఇక అలెక్స్‌ హేల్స్‌ 2019 వన్డే వరల్డ్‌ కప్‌కు ముందు సరదాగా ప్రమాదకరం కాని ‘రిక్రియేషనల్‌ డ్రగ్స్‌’ తీసుకున్నాడు. దాంతో అతనిపై 3 వారాల నిషేధం విధించారు. అలా మూడు వారాలు కాస్త మూడు సంవత్సరాలైపోయాయి. హేల్స్‌ మూడేళ్ల పాటు క్రికెట్‌కు దూరమవ్వడానికి కారణం మరో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌.

మోర్గాన్‌ దృష్టిలో మాత్రం డ్రగ్స్‌ వ్యవహారం చిన్న తప్పుగా అనిపించలేదు. దీనిని ‘నైతికత’కు సంబంధించిన అంశంగా వాదించిన మోర్గాన్‌ వరల్డ్‌ కప్‌ జట్టులోంచి హేల్స్‌ను తీసేయించాడు. నిజానికి 2015 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌ ఘోర వైఫల్యం తర్వాత జట్టు పునరుజ్జీవంలో హేల్స్‌ కూడా కీలకపాత్ర పోషించాడు. వన్డేల్లో ఇంగ్లండ్‌ రికార్డు స్కోర్లలో అతనిదే ప్రధాన పాత్ర. అయినా సరే మోర్గాన్‌ మాత్రం తగ్గలేదు. హేల్స్‌ను జట్టుకు దూరంగా ఉంచి తన మాట నెగ్గించుకున్నాడు. సరిగ్గా చెప్పాలంటే ‘నేను కెప్టెన్‌గా ఉన్నంత వరకు నువ్వు మళ్లీ ఇంగ్లండ్‌ జట్టులోకి రాలేవు’ అని సందేశం ఇచ్చాడు. చివరకు అదే జరిగింది.

అలా మూడేళ్ల పాటు ఇంగ్లండ్‌ జట్టుకు దూరమైన హేల్స్‌ మోర్గాన్‌ రిటైర్మెంట్‌ కాగానే మళ్లీ జట్టులోకి వచ్చాడు. బట్లర్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాకా తన మార్క్‌ను చూపెట్టాలని అలెక్స్‌ హేల్స్‌ను తిరిగి జట్టులోకి తీసుకొచ్చాడు. ఈ సెప్టెంబర్‌లో పాకిస్తాన్‌ టూర్‌లో హేల్స్‌ మంచి ప్రదర్శన కనబరిచాడు. కానీ అప్పటికే టి20 ప్రపంచకప్‌కు జట్టును ఎంపిక చేయగా అందులో హేల్స్‌ లేడు. కానీ బెయిర్‌ స్టో గాయపడడం హేల్స్‌కు కలిసి వచ్చింది. అలా ఒక వరల్డ్‌కప్‌ ఆడే చాన్స్‌ మిస్‌ అయింది. కానీ మరో వరల్డ్‌కప్‌ ఆడే అవకాశం వచ్చింది.

వచ్చిన రెండో అవకాశాన్ని హేల్స్‌ వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఇంకేముంది వెనక్కి తిరిగి చూస్తే హేల్స్‌ ప్రస్తుతం ఇంగ్లండ్‌ నుంచి టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. ఇక టీమిండియాతో జరిగిన సెమీస్‌లో హేల్స్‌ ఇన్నింగ్స్‌ను మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ కూడా చూశాడు. వరల్డ్‌కప్‌లో స్కై స్పోర్ట్స్‌ కామెంటరీ టీమ్‌లో భాగంగా ఉన్న ఇయాన్‌ మోర్గాన్‌  హేల్స్‌ బ్యాటింగ్‌కు చప్పట్లు కొడుతూ అతన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. అందుకే అంటారు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. మొన్న తిట్టినోడే ఇవాళ మెచ్చుకున్నాడు. అంటూ అభిమానులు కామెంట్‌ చేశారు.

చదవండి: ఆటలో లోపం లేదు.. టాలెంట్‌కు కొదువ లేదు.. ఎప్పుడు గుర్తిస్తారో!

WC 2022: ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’.. రేసులో 9 మంది! కోహ్లితో పాటు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top