వైట్‌బాల్ క్రికెట్‌లో పాకిస్తాన్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. శుక్రవారం రావల్పిండి వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో పాక్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో అఫ్రిది సేన సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో జనిత్ లియానగే (54 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కమిందు మెండిస్(44 పరుగులు), హసరంగా (37 నాటౌట్) , సమరవిక్రమ(42) రాణించారు. పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్,హారిస్ రవూఫ్ తలా మూడేసి వికెట్లు పడగొట్టారు.
బాబర్ సూపర్ సెంచరీ..
అనంతరం 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 48.2 ఓవర్లలో చేధించింది. పాక్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం ఆజేయ సెంచరీతో చెలరేగాడు. సుమారు రెండున్నరేళ్ల తర్వాత బాబర్ అంతర్జాతయ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
ఈ మాజీ కెప్టెన్ 119 బంతుల్లో, 8 ఫోర్ల సాయంతో 102 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ ఫఖర్ జమాన్ (78 పరుగులు), మహ్మద్ రిజ్వాన్ (51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లు మూడో వికెట్‌కు 103 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. లంక బౌలర్లలో చమీరా ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు.
చదవండి: IPL 2026: కావ్య మారన్ సంచలన నిర్ణయం..?


