
ఆసియాకప్-2025 జట్టులో చోటు కోల్పోయిన పాకిస్తాన్ స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లకు మరో షాక్ తగిలింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) 2025–26 సీజన్ కోసం ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో వీరిద్దరికి డిమోషన్ లభించింది. గత కొన్ని సంవత్సరాలుగా కేటగిరీ ఎలో ఉన్న బాబర్, రిజ్వాన్‌లు ఇప్పుడు కేటగిరీ బికి పడిపోయారు. ఆశ్చర్యకరంగా ఏ ఒక్క ప్లేయర్‌కు కూడా కేటగిరీ- ఎలో పీసీబీ చోటు కల్పించలేదు.
అదేవిధంగా కొత్తగా 12 మంది ఆటగాళ్లకు ఈ జాబితాలో చోటు దక్కింది. అహ్మద్ డానియాల్, ఫహీమ్ అష్రఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, ఖుష్దిల్ షా, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ హారీస్, మహ్మద్ నవాజ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ మీర్జా, సుఫ్యాన్ మొకిమ్‌లకు కొత్తగా పీసీబీ కాంట్రాక్ట్‌లు దక్కించుకున్నారు.
టీ20 కెప్టెన్‌కు ప్రమోషన్..
మరోవైపు పాక్ టీ20 కెప్టెన్ సల్మాన్ అలీ అఘా, స్టార్ పేసర్ హ్యారీస్ రవూఫ్, అర్బర్ ఆహ్మద్, సైమ్ అయూబ్‌లకు పాకిస్తాన్ క్రికెట్ ప్రమోషన్ ఇచ్చింది. కేటగిరీ- సిలో ఉన్న వీరంతా కేటగిరీ- బికి వచ్చారు. అదేవిధంగా ఆమిర్ జమాల్, కమ్రాన్ గులాం, ఉస్మాన్ ఖాన్, మీర్ హంజా వంటి వారు పీసీబీ కాంట్రాక్ట్‌ను కోల్పోయారు. స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది మాత్రం తన కేటగిరీ బి కాంట్రాక్ట్‌ను కాపాడుకున్నాడు.
పాకిస్తాన్ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న ఆటగాళ్లు వీరే..
కేటగిరీ బి (10 మంది ఆటగాళ్లు): అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, మహ్మద్ రిజ్వాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిది.
కేటగిరీ సి (10 ఆటగాళ్లు): అబ్దుల్లా షఫీక్, ఫహీమ్ అష్రఫ్, హసన్ నవాజ్, మహ్మద్ హరీస్, మహ్మద్ నవాజ్, నసీమ్ షా, నోమన్ అలీ, సాహిబ్జాదా ఫర్హాన్, సాజిద్ ఖాన్, సౌద్ షకీల్.
కేటగిరీ డి (10 మంది ఆటగాళ్లు): అహ్మద్ డానియాల్, హుస్సేన్ తలత్, ఖుర్రం షాజాద్, ఖుష్దిల్ షా, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, సల్మాన్ మీర్జా, షాన్ మసూద్, సుఫ్యాన్ మోకిమ్.
పాకిస్తాన్ ఆటగాళ్ల జీతాలు ఎంతంటే?
కేటగిరీ బి లో ఉన్న ఆటగాళ్లకు ఐసీసీ వాటా నుంచి 3 మిలియన్లు, పీసీబీ నుంచి 1.5 మిలియన్లు లభిస్తాయి. మొత్తంగా ఈ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు భారత కరెన్సీ ప్రకారం రూ.13 కోట్లపైగా దక్కనుంది. కేటగిరి సిలోని ఆటగాళ్లకు మొత్తంగా 7 లక్షలు లభించనుంది. చివరగా గ్రూపు-డిలో ఉన్న ఆటగాళ్లు భారత కరెన్సీలో నెలకు .2.19 లక్షల నుంచి రూ.4.38 లక్షల వరకు అందుకోనున్నారు.
చదవండి: నాన్‌సెన్స్.. అసలేం అనుకుంటున్నారు?: రోహిత్, కోహ్లి, గిల్‌పై మాజీ క్రికెటర్ ఆగ్రహం