ఇంగ్లండ్‌పై అక్షరాస్త్రం

Axar Patel Stars As India Dominate England - Sakshi

ఆరు వికెట్లతో అదరగొట్టిన అక్షర్‌ పటేల్‌

అశ్విన్‌కు మూడు వికెట్లు

112 పరుగులకే ఇంగ్లండ్‌ ఆలౌట్‌

భారత్‌ 99/3  

ఇన్నాళ్లూ ‘పింక్‌ టెస్టు’లను సీమర్లు శాసించారు. ఇప్పటిదాకా డే–నైట్‌ టెస్టులను గెలిచిన జట్లన్నీ పేసర్ల బలంతో నెగ్గాయి. భారత గడ్డపై జరిగిన ఏకైక పింక్‌బాల్‌ టెస్టు (ఈడెన్‌ గార్డెన్స్‌)లో కూడా టీమిండియా పేస్‌ దళంతోనే గెలిచింది. కానీ తాజా ‘పింక్‌’ ఆట స్పిన్నర్ల చేతుల్లోకి వెళ్లింది. తొలి టెస్టులో భారీ తేడాతో జయభేరి మోగించిన పర్యాటక ఇంగ్లండ్‌ జట్టు మూడో టెస్టులో అక్షర్‌ పటేల్, అశ్విన్‌ స్పిన్‌కు తలవంచింది. దీంతో రెండు సెషన్లను కూడా పూర్తిగా ఆడలేకపోయింది. అయితే భారత్‌ కూడా స్పిన్‌ వలలో పడి కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది.

అహ్మదాబాద్‌: డే–నైట్‌ టెస్టును తిప్పేసిన ఘనత కచ్చితంగా మన స్పిన్నర్లదే! ఫాస్ట్‌ బౌలర్లు చెలరేగే పింక్‌ బాల్‌ మ్యాచ్‌ ఇప్పుడు తిరగబడింది. స్పిన్నర్ల చేతుల్లోకి వచ్చేసింది. మొత్తానికి కొత్త స్టేడియంలో పాత ఆట సాగలేదు. ప్రధాన బౌలర్‌ కాకపోయినా... అక్షర్‌ పటేల్‌ (6/38) ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ పాలిట ప్రమాదకర బౌలరయ్యాడు. దీంతో బుధవారం మొదలైన మూడో టెస్టులో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 50 ఓవర్లయినా ఆడలేకపోయింది. 48.4 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ జాక్‌ క్రాలీ (53; 10 ఫోర్లు) ఒక్కడే భారత్‌ బౌలర్లను ఎదుర్కొన్నాడు.  మరో స్పిన్నర్‌ అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి. 100వ టెస్టు ఆడుతున్న ఇషాంత్‌కు ఒక వికెట్‌ లభించింది. తర్వాత తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ ఆట నిలిచే సమయానికి 33 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (82 బంతుల్లో 57 బ్యాటింగ్‌; 9 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ 2 వికెట్లు తీశాడు.  

తిప్పేసి... పడగొట్టేశాడు...
వందో టెస్టు ఆడుతున్న ఇషాంత్‌ శర్మ ఇంగ్లండ్‌ పతనానికి బీజం వేశాడు. మూడో ఓవర్లోనే సిబ్లీ (0)ని డకౌట్‌ చేశాడు. స్లిప్‌లో ఉన్న రోహిత్‌ అతని క్యాచ్‌ను అందుకోగా.... జట్టు స్కోరు 27 పరుగుల వద్ద రెండో వికెట్‌ పడింది. బెయిర్‌స్టో (0)కూడా ఖాతా తెరవలేదు. ఈ వికెట్‌తోనే అక్షర్‌ పటేల్‌ ప్రతాపం మెల్లిగా మొదలైంది. ఓపెనర్‌ క్రాలే...  కెప్టెన్‌ రూట్‌ (17) పోరాడేందుకు ప్రయతించాడు. కానీ తొలి సెషన్‌కు ముందే రూట్‌ను అశ్విన్, అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న క్రాలేని అక్షర్‌ ఔట్‌ చేశారు. 81/4 వద్ద ఇంగ్లండ్‌ విరామానికెళ్లింది. రెండో సెషన్‌ మొదలవగానే అశ్విన్, అక్షర్‌ చెరో వికెట్‌ పడగొట్టడంతో అదేస్కోరు (81/6) వద్ద ఇంకో రెండు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కూడా స్పిన్నర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో కేవలం 38 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లను ఇంగ్లండ్‌ కోల్పోయింది. 

రోహిత్‌ ఫిఫ్టీ
తర్వాత భారత్‌ ఇన్నింగ్స్‌ మొదలైనా... స్పిన్‌కు టాప్‌ ఆర్డర్‌ కుదేలైంది. 15వ ఓవర్లో గిల్‌ (11)ను ఆర్చర్‌ ఔట్‌ చేస్తే, పుజారాను పరుగైనా చేయకముందే లీచ్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కెప్టెన్‌ కోహ్లి అండతో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇద్దరు మూడో వికెట్‌కు 64 పరుగులు జోడించాక కోహ్లిని చక్కని డెలివరీతో లీచ్‌ బోల్తా కొట్టించాడు.

► భారత్‌ తరఫున 100 టెస్టులు ఆడిన 11వ క్రికెటర్‌గా ఇషాంత్‌ శర్మ గుర్తింపు పొందాడు. కపిల్‌ దేవ్‌ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో పేస్‌ బౌలర్‌గా ఇషాంత్‌ నిలిచాడు.

► అన్ని ఫార్మాట్‌లలో కలిపి అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో జహీర్‌ ఖాన్‌ (597 వికెట్లు)ను ఐదో స్థానానికి నెట్టి అశ్విన్‌ (598 వికెట్లు) నాలుగో స్థానానికి ఎగబాకాడు. అనిల్‌ కుంబ్లే (953), హర్భజన్‌ సింగ్‌ (707), కపిల్‌ దేవ్‌ (687) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

స్కోరు వివరాలు
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: క్రాలే (ఎల్బీడబ్ల్యూ) (బి) అక్షర్‌ పటేల్‌ 53; సిబ్లీ (సి) రోహిత్‌ శర్మ (బి) ఇషాంత్‌ శర్మ 0; బెయిర్‌స్టో (ఎల్బీడబ్ల్యూ) (బి) అక్షర్‌ పటేల్‌ 0; రూట్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్‌ 17; స్టోక్స్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్‌ 6; పోప్‌ (బి) అశ్విన్‌ 1; ఫోక్స్‌ (బి) అక్షర్‌ పటేల్‌ 12; ఆర్చర్‌ (బి) అక్షర్‌ పటేల్‌ 11;  లీచ్‌ (సి) పుజారా (బి) అశ్విన్‌ 3; బ్రాడ్‌ (సి) బుమ్రా (బి) అక్షర్‌ పటేల్‌ 3; అండర్సన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (48.4 ఓవర్లలో ఆలౌట్‌) 112.
వికెట్ల పతనం: 1–2, 2–27, 3–74, 4–80, 5–81, 6–81, 7–93, 8–98, 9–105, 10–112.
బౌలింగ్‌: ఇషాంత్‌ శర్మ 5–1–26–1; బుమ్రా 6–3–19–0; అక్షర్‌ పటేల్‌ 21.4–6–38–6; అశ్విన్‌ 16–6–26–3.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (బ్యాటింగ్‌) 57; గిల్‌ (సి) క్రాలే (బి) ఆర్చర్‌ 11; పుజారా (ఎల్బీడబ్ల్యూ) (బి) లీచ్‌ 0; కోహ్లి (బి) లీచ్‌ 27; రహానే (బ్యాటింగ్‌) 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (33 ఓవర్లలో మూడు వికెట్లకు) 99.
వికెట్ల పతనం: 1–33, 2–34, 3–98.
బౌలింగ్‌: అండర్సన్‌ 9–6–11–0; బ్రాడ్‌ 6–1–16–0; ఆర్చర్‌ 5–2–24–1; లీచ్‌ 10–1–27–2; స్టోక్స్‌ 3–0–19–0.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top