అప్పుడు బ్యాంక్‌ ఖాతాలో కేవలం 80 వేలు.. ఇప్పుడు కోటి దాకా ప్రైజ్‌మనీ! | Sakshi
Sakshi News home page

సుమిత్‌ సంచలనం: అప్పుడు బ్యాంక్‌ ఖాతాలో కేవలం 80 వేలు.. ఇప్పుడు కోటి దాకా ప్రైజ్‌మనీ!

Published Wed, Jan 17 2024 5:56 AM

Australian Open 2024: Sumit Nagal stuns World No. 27 to enter 2nd round for first time - Sakshi

Australian Open 2024- మెల్‌బోర్న్‌: ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆడితే అద్భుతం చేయవచ్చని భారత టెన్నిస్‌ ప్లేయర్‌ సుమిత్‌ నగాల్‌ నిరూపించాడు. టెన్నిస్‌ సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో 26 ఏళ్ల సుమిత్‌ చిరస్మరణీయ విజయంతో శుభారంభం చేశాడు.

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 137వ స్థానంలో ఉన్న సుమిత్‌ వరుస సెట్‌లలో 6–4, 6–2, 7–6 (7/5)తో ప్రపంచ 27వ ర్యాంకర్, 31వ సీడ్‌ అలెగ్జాండర్‌ బుబ్లిక్‌ (కజకిస్తాన్‌)పై సంచలన విజయం సాధించి ఈ టోర్నీలో తొలిసారి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. అంతేకాకుండా 35 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సీడెడ్‌ ప్లేయర్‌పై గెలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గా సుమిత్‌ గుర్తింపు పొందాడు.

1989 ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ రెండో రౌండ్‌లో టాప్‌ సీడ్‌ మాట్స్‌ విలాండర్‌ (స్వీడన్‌)పై రమేశ్‌ కృష్ణన్‌ గెలుపొందాడు. బుబ్లిక్‌తో 2 గంటల 37 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సుమిత్‌ ఒక్క డబుల్‌ ఫాల్ట్‌ కూడా చేయలేదు. ఒక ఏస్‌ కొట్టిన సుమిత్‌ ప్రత్యర్థి సరీ్వస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేశాడు. 29 విన్నర్స్‌ షాట్‌లతో రాణించిన సుమిత్‌ 26 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్‌ వద్దకు 32 సార్లు దూసుకొచ్చి 26 సార్లు పాయింట్లు దక్కించుకున్నాడు. మరోవైపు 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 82 కేజీల బరువున్న బుబ్లిక్‌ 13 ఏస్‌లతో విరుచుకుపడ్డా... 9 డబుల్‌ ఫాల్ట్‌లు, 44 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు.  
ఏఐటీఏ సహకరించకపోయినా...
ఫిబ్రవరిలో పాకిస్తాన్‌తో జరగాల్సిన డేవిస్‌ కప్‌ మ్యాచ్‌లో తాను ఆడలేనని అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఏఐటీఏ) అధికారులకు గత నెలలో సుమిత్‌ నగాల్‌ సమాచారం ఇచ్చాడు. దాంతో సుమిత్‌పై ఏఐటీఏ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ మెయిన్‌ ‘డ్రా’లో ఆసియా కోటా నుంచి భారత్‌కు అందుబాటులో ఉన్న ‘వైల్డ్‌ కార్డు’ కోసం సుమిత్‌ పేరును పంపించకూడదని ఏఐటీఏ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో సుమిత్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ మెయిన్‌ ‘డ్రా’లో చోటు కోసం క్వాలిఫయింగ్‌ టోర్నీలో బరిలోకి దిగాడు.

ఏఐటీఏ తనకు సహకరించకపోయినా సుమిత్‌ నిరాశపడకుండా తన శక్తినంతా ధారపోసి, ఏకాగ్రతతో, పట్టుదలతో ఆడి క్వాలిఫయింగ్‌ టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలుపొందాడు. క్వాలిఫయర్‌ హోదాలో రెండోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మెయిన్‌ ‘డ్రా’లో చోటు సంపాదించాడు. 2021లో తొలి రౌండ్‌లోనే వెనుదిరిగిన సుమిత్‌ ఈసారి మాత్రం గొప్ప విజయంతో రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. అంతకుముందు 2019 యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ తొలి రౌండ్‌లో స్విట్జర్లాండ్‌ దిగ్గజం ఫెడరర్‌ చేతిలో ఓడిపోయిన సుమిత్‌ 2020 యూఎస్‌ ఓపెన్‌లో రెండో రౌండ్‌కు చేరుకున్నాడు.  

900 యూరోలతో...
గత ఏడాది ఆరంభంలో సుమిత్‌ బ్యాంక్‌ ఖాతాలో కేవలం 900 యూరోలు (రూ. 80 వేలు) ఉన్నాయి. దాంతో తొలి మూడు నెలలపాటు తాను జర్మనీలో రెగ్యులర్‌గా ప్రాక్టీస్‌ చేసే అకాడమీకి వెళ్లలేకపోయాడు. ఈ దశలో అతని మిత్రులు సోమ్‌దేవ్‌ దేవ్‌వర్మన్, క్రిస్టోఫర్‌ మార్కస్, మహా టెన్నిస్‌ ఫౌండేషన్‌ ఆర్థిక సహాయం చేసి అండగా నిలబడ్డారు.

గతంలో తాను గెల్చుకున్న ప్రైజ్‌మనీ, తన ఉద్యోగ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ద్వారా లభించే వేతనాన్ని ఏటీపీ సర్క్యూట్‌లో చాలెంజర్‌ టోర్నీలు ఆడేందుకు సుమిత్‌ వెచ్చించాడు. తాను పాల్గొన్న 24 టోర్నీలలో నిలకడగా రాణించి సుమిత్‌ రూ. 65 లక్షల వరకు ప్రైజ్‌మనీ సంపాదించాడు.

కొత్త ఏడాదిలో కాన్‌బెర్రా చాలెంజర్‌ టోర్నీలో సుమిత్‌ తొలి రౌండ్‌లోనే ఓడిపోయినా ... ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో రెండో రౌండ్‌కు చేరుకోవడం ద్వారా సుమిత్‌కు కనీసం 1,85,000 ఆస్ట్రేలియన్‌ డాలర్లు (రూ. 1 కోటి) ప్రైజ్‌మనీగా రావడం ఖాయమైంది.  

యూకీ బాంబ్రీ జోడీ ఓటమి
పురుషుల డబుల్స్‌లో యూకీ బాంబ్రీ (భారత్‌)–రాబిన్‌ హాస్‌ (నెదర్లాండ్స్‌) జోడీ పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో యూకీ–హాస్‌ ద్వయం 6–1, 6–7 (8/10), 6–7 (7/10)తో నికోలస్‌ బారిన్‌టోస్‌ (కొలంబియా)–రాఫెల్‌ మాటోస్‌ (బ్రెజిల్‌) జోడీ చేతిలో ఓడిపోయింది.  

అల్‌కరాజ్, స్వియాటెక్‌ ముందంజ
పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌), మహిళల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌ స్వియాటెక్‌ (పోలాండ్‌) శుభారంభం చేశారు. తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో అల్‌కరాజ్‌ 7–6 (7/5), 6–1, 6–2తో రిచర్డ్‌ గాస్కే (ఫ్రాన్స్‌)పై గెలుపొందగా... స్వియాటెక్‌ 7–6 (7/2), 6–2తో సోఫియా కెనిన్‌ (అమెరికా)ను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), ఎనిమిదో సీడ్‌ హోల్గర్‌ రూనె (డెన్మార్క్‌)... మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్‌ రిబాకినా (కజకిస్తాన్‌), ఐదో సీడ్‌ జెస్సికా పెగూలా (అమెరికా) కూడా రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు.

Advertisement
 
Advertisement
 
Advertisement