డాన్‌ బ్రాడ్‌మన్‌ రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్‌ స్మిత్‌

AUS VS SA 3rd Test Day 2: Steve Smith Surpasses Don Bradman - Sakshi

AUS VS SA 3rd Test: సిడ్నీ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆసీస్‌ స్టార్‌ ఆటగాడు, ఆ జట్టు మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ పలు అరుదైన రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో శతకొట్టిన స్టీవ్‌ స్మిత్‌ (192 బంతుల్లో 104; 11 ఫోర్లు, 2 సిక్సర్లు).. కెరీర్‌లో 30వ సారి ఈ మైలురాయిని చేరుకున్నాడు.

తద్వారా క్రికెట్‌ దిగ్గజం సర్‌ డొనాల్డ్‌ బ్రాడ్‌మన్‌ రికార్డు పేరిట ఉన్న 29 శతకాల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో ఆసీస్‌ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో రికీ పాంటింగ్‌ (41) టాప్‌లో ఉండగా.. స్టీవ్‌ వా (32) రెండో స్థానంలో నిలిచాడు.

ప్రస్తుతం స్మిత్‌.. మాథ్యూ హేడెన్‌తో (30) సమంగా మూడో  స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం క్రికెట్‌ ఆడుతున్న ఆసీస్‌ ఆటగాళ్లలో రికీ పాంటింగ్‌ రికార్డు బద్దలు కొట్టే అవకాశం స్మిత్‌తో పాటు మార్నస్‌ లబూషేన్‌కు మాత్రమే ఉంది.

ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉన్న లబూషేన్‌ 33 మ్యాచ్‌ల్లో 59.43 సగటున 10 సెంచరీల సాయంతో 3150 పరుగులు చేశాడు. ఆసీస్‌ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో డేవిడ్‌ వార్నర్‌, ఉస్మాన్‌ ఖ్వాజా ఉన్నప్పటికీ.. వయసు పైబడిన రిత్యా వీరు మరో రెండు, మూడేళ్లకు మించి టెస్ట్‌ల్లో కొనసాగే అవకాశం లేదు. ప్రస్తుతం వార్నర్‌ ఖాతాలో 25, ఖ్వాజా ఖాతాలో 13 శతకాలు ఉన్నాయి. స్మిత్‌ శతకం​ సాధించిన మ్యాచ్‌లోనే ఖ్వాజా తన 13వ సెంచరీ నమోదు చేశాడు.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో మూడో సెషన్‌ డ్రింక్స్‌ సమయానికి ఆసీస్‌ 4 వికెట్ల నష్టానికి 475 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఖ్వాజా (195) తన కెరీర్‌ తొలి డబుల్‌ సెంచరీ దిశగా సాగుతున్నాడు. మధ్యలో ట్రవిస్‌ హెడ్‌ (59 బంతుల్లో 70; 8 ఫోర్లు, సిక్స్‌) కాసేపు మెరుపులు మెరిపించాడు. ఖ్వాజాకు జతగా మాట్‌ రెన్షా (5) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు తొలి రోజు డేవిడ్‌ వార్నర్‌ (10), లబూషేన్‌ (79) ఔటయ్యారు. 

సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల్లో ఆసీస్‌ భారీ విజయాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆతిధ్య జట్టు.. రెండో మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 182 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టెస్ట్‌ సిరీస్‌ తదుపరి జనవరి 12, 14, 17 తేదీల్లో ఇరు జట్లు 3 వన్డేల సిరీస్‌లో తలపడతాయి.  
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top