Ajay Jadeja: ఆఫ్ఘనిస్తాన్‌తో జాగ్రత్త.. భారత్‌, పాక్‌లకు షాకిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు..!

Asia Cup 2022: Wont Be Surprised If Afghanistan Knock India Or Pakistan Out Says Ajay Jadeja - Sakshi

ఆసియా కప్‌ 2022లో అంచనాలకు మించి రాణిస్తూ.. తమకంటే మెరుగైన జట్లకు షాకిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆఫ్ఘనిస్తాన్‌పై టీమిండియా మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా ప్రశంసల వర్షం కురిపించాడు. పసికూనే కాదా అని ఆఫ్ఘనిస్తాన్‌ను తక్కువ అంచనా వేసి ఏమరపాటుగా ఉంటే భారత్‌, పాక్‌లకు కూడా షాక్‌ తప్పదని హెచ్చరించాడు. 

తొలి మ్యాచ్‌లో శ్రీలంకను, రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి, ఉరకలేస్తున్న ఆఫ్ఘన్‌ను నిలువరించడం భారత్‌, పాక్‌ లాంటి జట్లకు కూడా సవాలేనని పేర్కొన్నాడు. ఆఫ్ఘన్‌ను ముఖ్యంగా బౌలింగ్‌లో అస్సలు తక్కువ అంచనా వేయరాదని.. లంకతో మ్యాచ్‌లో యువ పేసర్‌ ఫజల్‌ హాక్‌ ఫారూఖీ (3/11), ముజీబ్‌ (2/24), నబీ (2/14).. బంగ్లాతో మ్యాచ్‌లో ముజీబుర్‌ రెహ్మాన్ (‌3/16), రషీద్‌ ఖాన్‌ (3/22) లు ప్రత్యర్ధులకు ఏ గతి పట్టించారో అందరూ చూశారని అన్నాడు. 

అలాగే బ్యాటింగ్‌లోనూ ఆఫ్ఘాన్‌ను చిన్నచూపు చూడరాదని, బంగ్లాపై ఆ జట్టు బ్యాటర్లు ఇబ్రహీం జద్రాన్‌ (41 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు‌), నజీబుల్లా జద్రాన్‌ (17 బంతుల్లో 43 నాటౌట్‌; ఫోర్‌, 6 సిక్సర్లు) ఏ రకంగా చెలరేగారో భారత్‌, పాక్‌లు గమనించాలని అల్టర్‌ జారీ చేశాడు. బంగ్లాదేశ్‌తో ఆఫ్ఘానిస్తాన్‌ మ్యాచ్‌ అనంతరం క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. జడేజా ఈ మేరకు వ్యాఖ్యానించాడు. 

కాగా, బంగ్లాపై విజయంతో ఆఫ్ఘాన్‌.. గ్రూప్‌-బి నుంచి సూపర్‌-4కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ గ్రూప్‌ నుంచి రెండో స్థానం కోసం శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్లు తలపడనున్నాయి. గ్రూప్‌-ఏ విషయానికొస్తే.. పాక్‌పై తొలి మ్యాచ్‌లో విజయంతో టీమిండియా సూపర్‌-4 తొలి బెర్తును (గ్రూప్‌-ఏ) దాదాపుగా ఖరారు చేసుకోగా.. రెండో స్థానం కోసం పాకిస్తాన్‌, హాంగ్‌కాంగ్‌ జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్‌-ఏలో ఇవాళ భారత్‌-హాంగ్‌కాంగ్‌ జట్లు తలపడనున్నాయి.  
చదవండి: ఆరు సిక్సర్లతో ప్రపంచ రికార్డు సాధించిన అఫ్గన్‌ బ్యాటర్‌

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top