BGT 2023: 688వ వికెట్‌ అత్యంత ప్రత్యేకం.. అశ్విన్‌ అరుదైన ఘనత! కపిల్‌దేవ్‌ను దాటేసి..

Ashwin 688th International Wicket Goes Past Kapil Dev 3rd Indian Bowler - Sakshi

India vs Australia, 3rd Test: టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌దేవ్‌ను అధిగమించాడు.

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో అశూ అదరగొడుతున్న విషయం తెలిసిందే. తొలి టెస్టులో 8, రెండో టెస్టులో ఆరు వికెట్లతో సత్తా చాటి.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌ 1గా అవతరించాడు.

 688వ వికెట్‌..
ఈ క్రమంలో ఇండోర్‌లో జరుగుతున్న మూడో టెస్టులోనూ అశ్విన్‌ ప్రభావం చూపుతున్నాడు. గురువారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా మూడు వికెట్లు పడగొట్టాడు అశూ. తొలుత హ్యాండ్స్‌కోంబ్‌(19) తర్వాత అలెక్స్‌ క్యారీ(3)ని అవుట్‌ చేశాడు. కాగా క్యారీ వికెట్‌ అశ్విన్‌ కెరీర్‌లో 688వది. దీంతో అతడు ఈ అరుదైన జాబితాలో చేరాడు. 

ఇక ఆఖర్లో అశూ నాథన్‌ లియోన్‌ వికెట్‌ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇండోర్‌ టెస్టులో టీమిండియా 109 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌ ముగించగా.. ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌట్‌ అయింది. రవీంద్ర జడేజాకు నాలుగు, అశ్విన్‌కు మూడు, ఉమేశ్‌ యాదవ్‌కు మూడు వికెట్లు దక్కాయి.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లు(ఇప్పటివరకు)
1.అనిల్ కుంబ్లే- 953(499)
2.హర్భజన్‌ సింగ్‌- 707(442)
3.రవిచంద్రన్‌ అశ్విన్‌- 688*(347)
4.కపిల్‌ దేవ్‌- 687(448)
5.జహీర్‌ ఖాన్‌- 597(373)

నంబర్‌ 1 అశ్విన్‌
ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో ఆరు వికెట్లు పడగొట్టిన ప్రదర్శన... భారత మేటి స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను మళ్లీ ప్రపంచ నంబర్‌వన్‌ బౌలర్‌గా చేసింది. బుధవారం విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ పేస్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ను రెండో స్థానానికి పంపించి అశ్విన్‌ నంబర్‌వన్‌ స్థానాన్ని అందుకున్నాడు.

36 ఏళ్ల అశ్విన్‌ తొలిసారి 2015లో టాప్‌ ర్యాంక్‌లో నిలిచాడు. ఆ తర్వాత పలుమార్లు అతను ఈ ఘనత సాధించాడు. గత మూడు వారాల్లో టాప్‌ ర్యాంక్‌లో ముగ్గురు వేర్వేరు బౌలర్లు నిలవడం విశేషం. అండర్సన్‌కంటే ముందు ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఈ స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 90 టెస్ట్‌లు ఆడిన అశ్విన్‌ 463 వికెట్లు పడగొట్టాడు.

ఈ చెన్నై స్పిన్నర్‌ 864 రేటింగ్‌ పాయింట్లతో తాజాగా అగ్రస్థానానికి చేరుకోగా... అండర్సన్‌ 859 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. కమిన్స్‌ మూడో స్థానానికి చేరుకోగా... భారత్‌కే చెందిన బుమ్రా నాలుగో ర్యాంక్‌లో, షాహీన్‌ అఫ్రిది (పాకిస్తాన్‌) ఐదో ర్యాంక్‌లో ఉన్నారు. టెస్ట్‌ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా తొలి స్థానంలో, అశ్విన్‌ రెండో స్థానంలో, అక్షర్‌ పటేల్‌ ఐదో స్థానంలో ఉన్నారు.

చదవండి: Jasprit Bumrah: న్యూజిలాండ్‌కు వెళ్లనున్న బుమ్రా  
Ind Vs Aus: ఇప్పటి వరకు అత్యంత చెత్త పిచ్‌ ఇదే! కానీ 109 పరుగులకే ఆలౌట్‌ కావడం వారి వైఫల్యమే! అప్పుడు కూడా ఇదే మాట అంటారా?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top