
Ind vs Aus 3rd test- Ian Chappell Slams Players, Administrators Over Pitch: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 టెస్టు సిరీస్‌లో ముగిసిన తొలి రెండు టెస్టులతో పోలిస్తే ఇండోర్ పిచ్ చెత్తగా ఉందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ విమర్శించాడు. మేనేజ్‌మెంట్, ఆటగాళ్లు పిచ్ రూపకల్పన విషయంలో జోక్యం చేసుకోకూడదని, ఆ విషయాన్ని పూర్తిగా క్యూరేటర్‌కే వదిలేయాలన్నాడు.
మూడో టెస్టు మొదటి రోజు కంగారూ జట్టుకు అదృష్టం కలిసి వచ్చిందని.. ఏదేమైనా 109 పరుగులకే ఆలౌట్ కావడం టీమిండియా వైఫల్యానికి నిదర్శనమని అభిప్రాయపడ్డాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌లో భాగంగా టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే.
ఆది నుంచే పిచ్‌పై నిందలు
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం తేలికైన విషయం కాదని ఆసీస్‌కు గతంలో ఎన్నోసార్లు అవగతమైంది. అయితే, ఈసారి మాత్రం ఎలాగైనా గత రికార్డులు చెరిపేస్తామంటూ ప్రగల్భాలు పలికారు ఆస్ట్రేలియా ఆటగాళ్లు. ఈ క్రమంలో సిరీస్ ఆరంభానికి ముందే పిచ్‌పై నిందలు వేయడం మొదలుపెట్టారు.
నాగ్‌పూర్, ఢిల్లీ టెస్టులు రెండున్నర రోజుల్లోనే ముగిసి టీమిండియా విజయం సాధించడంతో ఆస్ట్రేలియా మీడియా సహా మాజీల విమర్శలు ఎక్కువయ్యాయి. ఉపఖండ పిచ్‌లపై అక్కసు వెళ్లగక్కుతూ అసహనం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తాజాగా ఇండోర్ మ్యాచ్‌లో తొలి రోజు నుంచే బంతి స్పిన్‌కు టర్న్‌కు అవుతుండటంతో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి.
ఇక మొదటి రోజు ఆటలో ఆసీస్ స్పిన్నర్లు మాథ్యూ కుహ్నెమన్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ చెలరేగడంతో టీమిండియా 109 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఈ నేపథ్యంలో ఇయాన్ చాపెల్ ఈఎస్‌పీఎన్‌క్రిక్ ఇన్ఫోతో మాట్లాడుతూ.. పిచ్ గురించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
అత్యంత చెత్తగా ఉంది.. కానీ
‘‘ఇప్పటి వరకు చూసిన మూడు పిచ్‌లలో ఇది అత్యంత చెత్తగా ఉంది. కానీ.. మరీ ఇక్కడ 109 పరుగులు మాత్రమే చేయడం అంటే బ్యాటర్ల వైఫల్యమే. టీమిండియా 109 పరుగులకే ఆలౌట్ కావడానికి పూర్తిగా పిచ్‌నే కారణంగా చెప్పలేము. నిజానికి ఆస్ట్రేలియాకు అదృష్టం కలిసి వచ్చిందనే చెప్పాలి.
అయినా పిచ్ రూపకల్పన అన్న అంశం పూర్తిగా క్యూరేటర్‌కే వదిలేయాలి. అప్పుడే తమ ఆలోచనలకు అనుగుణంగా వాళ్లు మెరుగైన పిచ్ తయారు చేస్తారు. అప్పుడు ఆటగాళ్లు తమ పని చేసుకుంటారు.
చెరువులో దూకమని చెప్పినట్లే
అలా కాకుండా మేనేజ్‌మెంట్, క్రికెటర్లు క్యూరేటర్ దగ్గరికి వెళ్లి మాకు అలాంటి పిచ్ కావాలి! ఇలాంటి పిచ్ కావాలి! అని ఒత్తిడి చేస్తే క్యూరేటర్‌ను ఇబ్బందుల్లో పడేసినట్లే! మీరిలా చేస్తున్నారు అంటే క్యూరేటర్‌ను వెళ్లి చెరువులో దూకమని చెప్పడం కిందే లెక్క!’’ అని ఇయాన్ చాపెల్ పేర్కొన్నాడు.
అప్పుడు కూడా ఇలాగే అంటారా?
ఈ క్రమంలో టీమిండియా అభిమానులు ఇయాన్ చాపెల్ హితవచనాలకు తమదైన శైలిలో కౌంటర్లు వేస్తున్నారు. ‘‘ఆస్ట్రేలియాలో పేస్‌కు అనూకలించే పిచ్‌ల విషయంలోనూ పర్యాటక జట్టు ఓడిపోయినప్పుడు ఇలాగే మాట్లాడతావా? లేదంటే అప్పుడు మరోలా మాట మారుస్తావా? ఒకవేళ మొదటి రోజు టీమిండియా బ్యాటర్లు మంచి స్కోరు నమోదు చేస్తే ఏమనేవాడివో! అవును.. నాగ్‌పూర్, ఢిల్లీ మ్యాచ్‌లో మీ బ్యాటర్లు ఏం చేశారో గుర్తుందా?’’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మూడో టెస్టులో ఆసీస్ 197 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ ముగించింది.
చదవండి: Legends League Cricket 2023: ఇండియా, ఆసియా కెప్టెన్లు ఎవరంటే!
PSL 2023: రోవమన్ పావెల్ ఊచకోత.. బాబర్ సేన ఘన విజయం