Australian Open 2023: మహిళల సింగిల్స్‌ విజేత సబలెంకా

Aryna Sabalenka Win Australian Open 2023 Maiden Grandslam Beat Rybakina - Sakshi

ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ చాంప్‌గా బెలారస్‌ స్టార్‌ 

తొలి గ్రాండ్‌స్లామ్‌ అందుకున్న సబలెంకా 

ఫైనల్లో రిబాకినాపై విజయం 

ఒకరు 195 కిలోమీటర్ల వేగంతో సర్వీస్‌ చేస్తున్నారు.... మరొకరు ఏమాత్రం తగ్గకుండా 192 కిలోమీటర్ల వేగంతో జవాబిస్తున్నారు... ప్రతీ పాయింట్‌ కోసం హోరాహోరీ  సమరం... వీరి షాట్లతో బంతి పగిలిపోతుందేమో అనిపించింది... ఒకరు ఇప్పటికే గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌ కాగా, మరొకరు తొలి టైటిల్‌ వేటలో పోరాడుతున్నారు...దూకుడు ఎలా ఉందంటే తొలి 13 పాయింట్లలో 7 ఏస్‌ల ద్వారానే వచ్చాయి... చివరి వరకు కూడా అదే ధాటి కొనసాగింది... గత కొన్నేళ్లుగా ఏకపక్షంగా జరుగుతున్న మహిళల గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ మ్యాచ్‌లతో పోలిస్తే పోటీపోటీగా, అత్యుత్తమ స్థాయిలో ఈ తుది పోరు సాగింది. చివరకు 2 గంటల 28 నిమిషాల ఆట తర్వాత విజేత అవతరించింది. ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ కొత్త చాంపియన్‌గా అరైనా సబలెంకా నిలిచింది.   

మెల్‌బోర్న్‌: ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో చాంపియన్‌గా నిలిచిన 29వ క్రీడాకారిణిగా అరైనా సబలెంకా గుర్తింపు తెచ్చుకుంది. శనివారం జరిగిన తుది పోరులో సత్తా చాటిన 24 ఏళ్ల ఈ బెలారస్‌ స్టార్‌ తన కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ను అందుకుంది. ఫైనల్‌ మ్యాచ్‌లో 22వ సీడ్‌ సబలెంకా 4–6, 6–3, 6–4 స్కోరుతో ఐదో సీడ్‌ ఎలెనా రిబాకినా (కజకిస్తాన్‌)ను ఓడించింది.

మ్యాచ్‌లో సబలెంకా 17 ఏస్‌లు కొట్టగా, రిబాకినా 9 ఏస్‌లు బాదింది. ప్రత్యరి్థతో పోలిస్తే 51–31 విన్నర్లతో ఆమె పైచేయి సాధించింది. విజేతగా నిలిచిన సబలెంకాకు 29 లక్షల 75 వేల ఆ్రస్టేలియన్‌ డాలర్లు (సుమారు రూ. 17.34 కోట్లు), రన్నరప్‌ రిబాకినాకు 16 లక్షల 25 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లు (సుమారు రూ. 9.47 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. తాజా గెలుపుతో సబలెంకా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరే అవకాశం ఉంది.  

హోరాహోరీగా... 
ఫైనల్‌కు ముందు బలాబలాలు చూస్తే ఇద్దరు సమఉజ్జీలుగానే కనిపించారు. ఇప్పటికే గ్రాండ్‌స్లామ్‌ గెలిచిన అనుభవంతో పాటు ఈ టోరీ్నలో ముగ్గురు గ్రాండ్‌స్లామ్‌ విజేతలు స్వియాటెక్, ఒస్టాపెంకో, అజరెంకాలను ఓడించిన ఘనతతో రిబాకినా బరిలోకి దిగగా, ఈ ఏడాది ఓటమి ఎరుగని రికార్డుతో సబలెంకా నిలిచింది. తొలి సెట్‌లో రిబాకినా ఆధిక్యం ప్రదర్శిస్తూ 3–1తో ముందంజ వేసినా, ఆపై కోలుకొని ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన బెలారస్‌ ప్లేయర్‌ 4–4తో స్కోరు సమం చేసింది.

అయితే బ్రేక్‌ సాధించిన రిబాకినా ఆపై సర్వీస్‌ నిలబెట్టుకొని తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్‌లో తన ఫోర్‌హ్యాండ్‌ పదును ప్రదర్శించిన సబలెంకా 4–1 వరకు వెళ్లింది. ఆపై కజక్‌ ప్లేయర్‌ ఎదరుదాడి చేసే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. రెండు వరుస ఏస్‌లతో సబలెంకా సెట్‌ ముగించింది. మూడో సెట్‌లో ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో స్కోరు 3–3కు చేరింది. అయితే ఫోర్‌హ్యాండ్‌ విన్నర్‌తో కీలకమైన ఏడో గేమ్‌ను బ్రేక్‌ చేసిన సబలెంకాకు మళ్లీ వెనక్కి చూడాల్సిన అవసరం లేకపోయింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top