FIFA WC 2022: అర్జెంటీనాదే వరల్డ్‌కప్‌.. గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే!

Argentina Looks Favourite Against France Past-Records Ahead FIFA Final - Sakshi

ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌ తుది అంకానికి చేరుకుంది. డిసెంబర్‌ 18(ఆదివారం) ఫ్రాన్స్‌, అర్జెంటీనా మధ్య జరిగే ఫైనల్‌తో ఈ మెగాటోర్నీ ముగియనుంది. శనివారం మూడోస్థానం కోసం క్రొయేషియా, మొరాకోలు తలపడనున్నాయి. ఇక మెస్సీకి ఇదే ఆఖరి ఫిఫా వరల్డ్‌కప్‌. అంతేకాదు దేశం తరపున చివరి మ్యాచ్‌ ఆడనున్నాడు.

ఈ నేపథ్యంలో మెస్సీ తన కలను నెరవేర్చుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్స్‌గా బరిలోకి దిగి ఫైనల్లో అడుగుపెట్టిన ఫ్రాన్స్‌ వరుసగా రెండోసారి కప్‌ కొట్టాలని భావిస్తోంది. ఫ్రాన్స్‌ గనుక విజేతగా నిలిస్తే వరుసగా రెండోసారి ఫిఫా వరల్డ్‌కప్‌ నెగ్గిన మూడో జట్టుగా.. ఇటలీ(1934,1938), బ్రెజిల్‌(1958,1962) సరసన నిలవనుంది. 

ఇరుజట్ల ముఖాముఖి పోరులో మాత్రం ఫ్రాన్స్‌పై అర్జెంటీనాదే పైచేయిగా ఉంది.అర్జెంటీనా, ఫ్రాన్స్‌ టీమ్స్‌ ఇప్పటి వరకూ 12 అంతర్జాతీయ మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఇందులో అర్జెంటీనా ఆరు మ్యాచ్‌లు గెలవడం విశేషం. ఫ్రాన్స్‌ మూడింట్లోనే విజయం సాధించగా.. మరో మూడు డ్రాగా ముగిశాయి. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లలో ఇప్పటి వరకూ మూడుసార్లు ఈ రెండు టీమ్స్ ఆడాయి. అందులోనూ అర్జెంటీనానే రెండు విజయాలతో పైచేయి సాధించింది.

1930లో ఒకసారి 1-0తో, 1978లో 2-1తో ఫ్రాన్స్‌ను అర్జెంటీనా చిత్తు చేసింది. అయితే చివరిసారి 2018 వరల్డ్‌కప్‌లో మాత్రం ప్రీక్వార్టర్స్‌లో ఈ రెండు జట్లు తలపడినప్పుడు మాత్రం ఫ్రాన్స్‌ 4-3తో అర్జెంటీనాను ఓడించి ఇంటిబాట పట్టేలా చేసింది. ఇది మాత్రం ఫ్రాన్స్‌కు ఊరట కలిగించే విషయం. అయితే గత రికార్డులు చూసుకుంటే మాత్రం ఫ్రాన్స్‌పై పైచేయి సాధించిన అర్జెంటీనాదే ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌ అని అభిమానులు జోస్యం చెప్పారు.

చదవండి: ఫైనల్‌ ముందు ఫ్రాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. కరీం బెంజెమా వచ్చేస్తున్నాడు!

FIFA: గాయంతో అన్న దూరం.. తమ్ముడు అదరగొడుతున్నాడు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top