APL 2023: Key Players, Teams, Plans, Live Streaming Details - Sakshi
Sakshi News home page

APL 2023: తొలిరోజు మ్యాచ్‌కు శ్రీలీల.. జట్ల వ్యూహాలివే! లక్కీడిప్‌లో ఆ అదృష్టం మీదైతే!

Published Wed, Aug 16 2023 11:32 AM | Last Updated on Wed, Aug 16 2023 12:11 PM

Andhra Premier League 2023: Key Players Teams Plans Live Streaming Details - Sakshi

విశాఖ స్పోర్ట్స్‌: ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) రెండో సీజన్‌కు వైఎస్సార్‌ స్టేడియం సర్వసన్నద్ధమైంది. ఈ క్రికెట్‌ ఈవెంట్‌కు బుధవారం తెరలేవనుంది. ఏసీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ఏపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ పర్యవేక్షణలో రోజూ రెండు చొప్పున 19 మ్యాచ్‌లు జరగనున్నాయి. టైటిల్‌ పోరు ఈ నెల 27న జరగనుంది. మొత్తం ఆరు ఫ్రాంచైజీ జట్లు పాల్గొంటున్నాయి.

తొలిసీజన్‌ టైటిల్‌ పోరులో ఢీకొట్టిన బెజవాడ టైగర్స్‌, కోస్టల్‌ రైడర్స్‌ ఈసారి లీగ్‌ ప్రారంభ మ్యాచ్‌లోనే తలపడనుండడంతో ఏపీఎల్‌ – 2 ఆది నుంచే హోరాహోరీగా సాగనుంది. మ్యాచ్‌లు వీక్షించే అభిమానులకు లక్కీడిప్‌ ద్వారా విశాఖ వేదికగా త్వరలో జరగనున్న భారత్‌ ఆస్ట్రేలియా మ్యాచ్‌కు టికెట్లు అందించనున్నారు. సినీనటి శ్రీలీల తొలిరోజు మ్యాచ్‌ వీక్షించేందుకు రానున్నారు.

బెజవాడ టైగర్స్‌: వికెట్ల వెనుక నుంచే...
టైటిల్‌ పోరులో ఢీకొట్టి కేవలం ఏడు పరుగుల తేడాతో వెనుకబడిపోయిన బెజవాడ టైగర్స్‌ ఈసారి వికెట్ల వెనుక నుంచే మ్యాచ్‌ను ముందుకు నడిపించే ప్రణాళిక సిద్ధం చేసుకుంది. టైటిల్‌ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నామంటూ ఫ్రాంచైజీ అధినేత రమణమూర్తి అంటున్నారు.

అందులో భాగంగానే ఈ సీజన్‌లో అత్యధిక ధరతో రికీబుయ్‌ను నిలబెట్టుకుంది. ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్న రికీ మిడిలార్డర్‌లో ఇన్నింగ్స్‌ చక్కదిద్దడమే గాక జట్టును ముందుకు నడపనున్నాడు. మహీప్‌ వికెట్ల వెనుక సత్తా చాటనుండగా అవసరమైతే నేనున్నా అంటున్నాడు మహిమా. ఆల్‌రౌండర్లు షోయిబ్‌, సాయురాహుల్‌తోపాటు లలిత్‌, అవినాష్‌లుండగా సాయితేజ బంతితో చెలరేగనున్నాడు.

రాయలసీమ కింగ్స్‌ : టాప్‌ ఆర్డర్‌ పటిష్టం
సౌత్‌జోన్‌నే విజేతగా నిలిపిన హనుమ విహారి ఈసారి రాయలసీమ కింగ్స్‌ను టైటిల్‌ దిశగా నడిపించనున్నాడు. బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు గిరినాథ్‌, సాకేత్‌లను నిలబెట్టుకోగా మాధవ్‌, కలియప్పలను తీసుకుంది. అభిషేక్‌, వంశీకృష్ణ ఓపెనర్లుగా నిలదొక్కుకుంటే పొట్టి ఫార్మెట్‌లో పరుగుల వరదే. సుదర్శన్‌ కొత్త బంతితో ప్రత్యర్థికి చుక్కలు చూపించనున్నాడు. హరిశంకర్‌, పవన్‌ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు.

ఉత్తరాంధ్ర లయన్స్‌ : ఫైనల్‌ పోరే లక్ష్యం
తొలి సీజన్‌లో టాప్‌ 4లో నిలిచి ఎలిమినేటర్‌లోనే వెనుతిరిగిన ఉత్తరాంధ్ర లయన్స్‌ ఈ సారి ఫైనల్స్‌లో గర్జించేందుకు సిద్ధమైంది. స్థానికుడైన అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెటర్‌ భరత్‌ మినహా మిగిలిన ఐదుగురిని తక్కువ ధరకే నిలబెట్టుకున్న ఫ్రాంచైజీ ఐదుగురు కీలక ఆటగాళ్లను దక్కించుకుంది.

వీళ్లందరినీ ఫ్రాంచైజీ అధినేత వెంకటరెడ్డి వేలం చివరి వరకు ఉండి మరీ సొంతం చేసుకున్నారు. వీరిలో పృథ్వీ భౌలింగ్‌ ప్రారంభించనుండగా టాప్‌ ఆర్డర్‌లో తపస్వి, రాహుల్‌ బ్యాట్‌ ఝళిపించనుండగా వాసు, శ్రీనివాస్‌ ఆల్‌రౌండ్‌ ప్రతిభ కనబరచనున్నారు. ఇక జట్టుకు ఓపెనర్‌గా గుల్ఫమ్‌, వికెట్ల వెనుక భరత్‌, టాప్‌లో శ్యామ్‌, బౌలర్‌గా అజయ్‌, బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ రఫీ, అండర్‌ 16లో రాణిస్తున్న రచిత్‌ ఉండనే ఉన్నారు.

గోదావరి టైటాన్స్‌: మిడిలార్డర్‌తో బ్యాలెన్స్‌
గోదావరి టైటాన్స్‌ ఈ సారి ఓపెనర్లు, టాప్‌ ఆర్డర్‌ను పక్కా ప్రణాళికతో మ్యాచ్‌కు సిద్ధం చేసుకోగా మిడిలార్డర్‌లో ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ధీరజ్‌కుమార్‌కు జట్టును ముందుకు నడిపించే బాధ్యత అప్పగించింది. ఓపెనర్‌ హిమకర్‌, ఆల్‌రౌండర్లు శశికాంత్‌, సత్యనారాయణను జట్టు సొంతం చేసుకుంది. ఓపెనర్‌ వంశీతోపాటు టాప్‌ ఆర్డర్‌లో సాత్విక్‌, పాండురంగ, హేమంత్‌ను నిలబెట్టుకోగా మాధవ్‌ బౌలింగ్‌ చేయనున్నాడు.

►తలపడనున్న జట్లు : 6
►మొత్తం మ్యాచ్‌లు : 19
►టైటిల్‌ పోరు : 27న
►అన్ని మ్యాచ్‌లు ఫ్యాన్‌ కోడ్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం.

చదవండి: టీమిండియాతో సిరీస్‌ నాటికి వచ్చేస్తా.. వరల్డ్‌కప్‌ తర్వాత కెప్టెన్‌ అతడే! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement