
క్లచ్ చెస్ లెజెండ్స్ మ్యాచ్‌లో ఆనంద్ ఓటమి
సెయింట్ లూయిస్ (అమెరికా): భారత చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ క్లచ్ చెస్ లెజెండ్స్ మ్యాచ్‌లో రష్యా దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య జరిగిన పోరులో 62 ఏళ్ల కాస్పరోవ్ 13–11 పాయింట్ల తేడాతో ఆనంద్‌పై గెలుపొందాడు. అధికారికంగా ఆనంద్, కాస్పరోవ్ చివరిసారి 1995లో న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ 107వ అంతస్తులో క్లాసికల్ వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం పోటీపడ్డారు.
కాస్పరోవ్ 10.5–7.5తో ఆనంద్‌పై గెలిచి ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ దక్కించుకున్నాడు. కాస్పరోవ్ 30 ఏళ్ల తర్వాత కూడా అదే ఆటతీరు చూపెట్టాడు. ఈ పోరులో మొత్తం 12 గేమ్‌లు నిర్వహించాల్సి ఉండగా... చివరి రెండు బ్లిట్జ్ గేమ్‌లకంటే ముందే కాస్పరోవ్ గెలిచాడు. విజేత కాస్పరోవ్‌కు 70 వేల డాలర్లు (రూ. 62 లక్షలు), రన్నరప్ ఆనంద్‌కు 50 వేల డాలర్లు (రూ. 44 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది.
ఈ పోరు నిబంధనల ప్రకారం తొలి రోజున గేమ్‌లో గెలిస్తే ఒక పాయింట్... ‘డ్రా’ చేసుకుంటే అర పాయింట్ కేటాయించారు. రెండో రోజు జరిగిన గేమ్‌లో గెలిస్తే 2 పాయింట్లు... ‘డ్రా’ చేసుకుంటే ఒక పాయింట్ ఇచ్చారు. మూడో రోజు శనివారం గేమ్ గెలిచిన వారికి 3 పాయింట్లు కేటాయించారు. ‘ఇది చాలా ముఖ్యమైనది అని చెప్పలేను... కానీ విజయం సాధిస్తానని ఊహించలేదు.
చాలా మంది అభిమానులు ఈ మ్యాచ్‌ను ఫాలో అయ్యారు. సామాజిక మాధ్యమాల్లో ఇది చాలా ప్రధాన్యత సంతరించుకుంది. రెండో గేమ్ అనంతరం రిలాక్స్ అయ్యాను. నా అంచనాలకు మించి రాణించాను’ అని కాస్పరోవ్ అన్నాడు.