భారత షట్లర్లకు కరోనా కష్టాలు!

Ajay Jayaram, Shubhankar Dey out of SaarLorLux Open - Sakshi

టోర్నీనుంచి అర్ధాంతరంగా బయటకు

సొంత డబ్బులతో ఐసోలేషన్‌కు

సహకారం అందించనున్న ‘సాయ్‌’

సార్‌బ్రుకెన్‌ (జర్మనీ): కోవిడ్‌–19 కారణంగా వచ్చిన సుదీర్ఘ విరామం తర్వాత టోర్నీలో పాల్గొనేందుకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని భావించిన భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారులకు చేదు అనుభవం ఎదురైంది. ఇక్కడ ప్రారంభమైన సార్లార్‌ లక్స్‌ ఓపెన్‌ సూపర్‌–100 టోర్నీనుంచి మన షట్లర్లు అజయ్‌ జయరాం, శుభాంకర్‌ డే అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. బుధవారమే మరో ఆటగాడు లక్ష్య సేన్‌ కూడా టోర్నీకి దూరమయ్యాడు. కరోనా భయమే దీనికంతటికీ కారణం.

వివరాల్లోకెళితే... ఆటగాళ్లతో పాటు కోచ్‌ హోదాలో టోర్నీకి వచ్చిన లక్ష్య సేన్‌ తండ్రి డీకే సేన్‌ బుధవారం కరోనా ‘పాజిటివ్‌’గా తేలారు. దాంతో ఆయనతో కలిసి ఉన్న లక్ష్య సేన్‌ టోర్నీనుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే సేన్‌తో కలిసి సాధన చేసిన, ప్రయాణించిన జయరామ్, శుభాంకర్‌ కూడా తప్పుకోవాలని టోర్నీ నిర్వాహకులు సూచించారు. ఈ విషయాన్ని ‘బీడబ్ల్యూఎఫ్‌’ కూడా ప్రకటించింది. దాంతో వీరిద్దరు కూడా నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే నిబంధనల ప్రకారం కనీసం 10 నవంబర్‌ వరకు ఐసోలేషన్‌లో ఉండాలని చెప్పిన నిర్వాహకులు అందుకు తగినట్లుగా కనీస ఏర్పాట్లు కూడా చేయలేదు. ఎక్కడ ఉండాలో, అన్ని రోజులు ఖర్చులు ఎలా భరించాలనే విషయంపై కూడా స్పష్టతనివ్వకుండా వారి మానాన వారిని వదిలేశారు.

నిజానికి వీరిద్దరికి ఎలాంటి లక్షణాలు లేవు. జర్మనీ రావడానికి ముందే చేయించుకున్న పరీక్షల ‘నెగెటివ్‌’ రిపోర్టులు కూడా ఉన్నాయి. డీకే సేన్‌ రిపోర్టు వచ్చే సమయానికి జయరామ్‌ ఒక మ్యాచ్‌ కూడా ఆడేశాడు. ఈ విషయంలో టోర్నీ ఆరంభంలో సరైన కోవిడ్‌–19 నిబంధనలు పాటించని నిర్వాహకులతో పాటు పరీక్షలు చేయించుకోకుండా వచ్చిన లక్ష్యసేన్‌ తప్పు కొంత వరకు ఉండగా... వీరిద్దరు కూడా బాధితులయ్యారు. తాజా పరిణామాలతో ఆందోళన చెందిన జయరామ్‌ తన బాధను ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నాడు. ఎట్టకేలకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌) దీనిపై స్పందించింది. వారి భోజన, వసతి ఖర్చులను తాము భరించనున్నట్లు స్పష్టం చేసింది. దాంతో ఊరట పొందిన జయరామ్‌...సాధ్యమైనంత తర్వాత స్వదేశం తిరిగొస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top