
అహ్మదాబాద్: కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్లు వల్లూరి అజయ్ బాబు, బేద్‌బ్రత్ భరాలి బంగారు పతకాలు సాధించారు. గురువారం జరిగిన సీనియర్ పురుషుల 79 కేజీల కేటగిరీలో జాతీయ క్రీడల చాంపియన్ అయిన అజయ్ బాబు మొత్తం 335 కేజీల బరువెత్తి అగ్రస్థానంలో నిలిచాడు. స్నాచ్‌లో 152 కేజీల బరువెత్తి కామన్వెల్త్ చాంపియన్‌షిప్ రికార్డును కూడా నెలకొల్పాడు.
క్లీన్ అండ్ జెర్క్‌లో 183 కేజీలు ఎత్తాడు. స్నాచ్‌లో ఇంతకుముందు నైజీరియాకు చెందిన ఎడిడివోంగ్ జోసెఫ్ 147 కేజీల రికార్డును అజయ్ తిరగరాశాడు. గత క్రీడల్లోనూ అతను బంగారు పతకం సాధించినప్పటికీ అప్పుడు 81 కేజీల విభాగంలో పోటీపడ్డాడు. సీనియర్ మహిళల 69 కేజీల కేటగిరీలో కామన్వెల్త్ క్రీడల (2022) కాంస్య పతక విజేత హర్జిందర్ కౌర్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం నెగ్గింది.
జూనియర్ పురుషుల 79 కేజీల విభాగంలో బేదబ్రత్ భరాలి స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్‌లో కొత్త రికార్డులతో పసిడి పట్టాడు. అతను స్నాచ్‌లో 145 కేజీల బరువెత్తాడు. తద్వారా 139 కేజీల గత రికార్డును అధిగమించాడు. అలాగే క్లీన్ అండ్ జెర్క్‌లో 181 కేజీల బరువెత్తి 169 కేజీల గత రికార్డును తుడిచిపెట్టాడు. మొత్తంగా బేదబ్రత్ 326 కేజీల బరువెత్తాడు. యూత్ మహిళల 77 కేజీల విభాగంలో గ్రీష్మ తోరట్ రజతం నెగ్గింది.