
ఐశ్వర్య ప్రతాప్ సింగ్‌కు రెండు పతకాలు
షిమ్‌కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. ఆదివారం సీనియర్ పురుషుల విభాగంలో భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం దక్కింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తిగత విభాగంలో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ స్వర్ణ పతకం నెగ్గగా... టీమ్ విభాగంలో ఐశ్వర్య ప్రతాప్, చెయిన్ సింగ్, అఖిల్ షెరాన్‌లతో కూడిన భారత జట్టుకు రజతం లభించింది. ఫైనల్లో ఐశ్వర్య ప్రతాప్ 462.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
వెన్‌యు జావో (చైనా; 462) రజతం, నయోవా ఒకాడా (జపాన్; 448.8) కాంస్యం గెలిచారు. చెయిన్ సింగ్ (435.7) నాలుగో స్థానంలో, అఖిల్ (424.9 పాయింట్లు) ఐదో స్థానంలో నిలిచారు. టీమ్ విభాగంలో ఐశ్వర్య ప్రతాప్ (584 పాయింట్లు), చెయిన్ సింగ్ (582 పాయింట్లు), అఖిల్ (581 పాయింట్లు) బృందం మొత్తం 1747 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
జూనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తిగత భారత్‌కు చెందిన అడ్రియన్ కర్మాకర్ (463.8 పాయింట్లు) స్వర్ణ పతకాన్ని సాధించాడు. టీమ్ విభాగంలో అడ్రియన్, నితిన్, రోహిత్‌లతో కూడిన భారత బృందం 1733 పాయింట్లతో పసిడి పతకాన్ని నెగ్గింది. ఓవరాల్‌గా భారత్ 26 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి 46 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.