IPL 2021: ఐపీఎల్‌ ‘గాలి బుడగ’

Kolkata Knight Riders vs Royal Challengers Bangalore Postponed - Sakshi

ఇద్దరు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాళ్లకు కరోనా

మహమ్మారి బారిన వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌

కేకేఆర్, బెంగళూరు మ్యాచ్‌ వాయిదా

చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు బౌలింగ్‌ కోచ్‌ బాలాజీ ‘పాజిటివ్‌’

ఆందోళనలో క్రికెటర్లు బయో బబుల్‌ సురక్షితమన్న బీసీసీఐ

ఐపీఎల్‌లోని మొత్తం 60 మ్యాచ్‌లలో 29 మ్యాచ్‌లు ముగిశాయి. లీగ్‌ బయట కరోనా వైరస్‌ కారణంగా ఎంతటి విపత్కర పరిస్థితులు ఉన్నా బయో బబుల్‌ ఏర్పాట్ల మధ్య ఆట నిరాటంకంగా సాగిపోయింది. ఇప్పుడు ఒక్కసారిగా అనూహ్య కుదుపు. సగం ఐపీఎల్‌ ముగిసిన తర్వాత కరోనా క్రికెటర్లను తాకింది. ఇద్దరు ఆటగాళ్లు కోవిడ్‌–19 బారిన పడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్‌ను కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. ఆందోళన చెందాల్సిన పని లేదని, మరిన్ని జాగ్రత్తలతో టోర్నీని కొనసాగిస్తామని బీసీసీఐ చెబుతున్నా... కరోనా తీవ్రత ఇంతటితోనే ఆగిపోతుందా లేక మున్ముందు పరీక్షలలో మరిన్ని కేసులు బయటపడి లీగ్‌పై ప్రభావం పడుతుందా చూడాలి.

అహ్మదాబాద్‌: గత ఏడాది యూఏఈలో ఐపీఎల్‌ టోర్నీ ప్రారంభానికి ముందే చెన్నై బృందంలో పలువురు కరోనా బారిన పడటం, తర్వాత అంతా చక్కబడటం జరిగాయి.  ఈసారి కూడా లీగ్‌ ఆరంభానికి ముందు నితీశ్‌ రాణా, అక్షర్‌ పటేల్, దేవ్‌దత్‌ పడిక్కల్, డానియల్‌ సామ్స్‌లకు కూడా కరోనా సోకింది. అయితే ఇప్పుడు టోర్నీ మధ్యలో క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి, అదే టీమ్‌ పేస్‌ బౌలర్‌ సందీప్‌ వారియర్‌ ‘పాజిటివ్‌’గా తేలినట్లు బీసీసీఐ ప్రకటించింది.

గత నాలుగు రోజుల్లో మూడుసార్లు పరీక్షలు నిర్వహించగా ఇది బయటపడినట్లు బోర్డు పేర్కొంది. నైట్‌రైడర్స్‌ టీమ్‌లోని ఇతర ఆటగాళ్ల పరీక్షలన్నీ నెగెటివ్‌గా తేలినట్లు కూడా వెల్లడించింది. ఆదివారం నుంచి కేకేఆర్‌ ఆటగాళ్లంతా తమ హోటల్‌ గదులలో ఐదు రోజుల క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేసినట్లు కూడా బీసీసీఐ ప్రకటించింది. లీగ్‌లో వరుణ్‌ చక్రవర్తి ఇప్పటి వరకు తమ జట్టు తరఫున అన్ని (7) మ్యాచ్‌లూ ఆడగా... సందీప్‌ వారియర్‌ ఒక్కసారి కూడా బరిలోకి దిగలేదు.   

వెనక్కి తగ్గేది లేదు...
ఫ్లయిట్‌ల నిషేధంతో ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆందోళనలో ఉండగా... ఇప్పుడు కరోనా కారణంగా అది మరింత పెరిగింది. కేకేఆర్‌ టీమ్‌ సభ్యుడైన ప్యాట్‌ కమిన్స్‌ తన ఆసీస్‌ సహచరులకు తాజా పరిణామాల గురించి చెప్పినట్లు సమాచారం. అయితే  ఐపీఎల్‌ను నిలిపివేసే విషయంలో వస్తున్న వార్తలను బీసీసీఐ అధికారులు ఖండించారు. తాము ఇకపై మరింత జాగ్రత్తలు తీసుకుంటామని, కోల్‌కతా ఆటగాళ్లు కరోనా బారిన పడిన ఘటన తమపై బాధ్యతను మరింత పెంచిందని బోర్డు కీలక సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. దీనిని సవాల్‌గా స్వీకరించి తాము మిగిలిన టోర్నీని నిర్వహిస్తామని ఆయన అన్నారు.

‘బయో బబుల్‌ ఇప్పటికీ సురక్షితమే. వరుణ్‌ బయటకు వెళ్లడం వల్ల అలా జరిగిందే తప్ప బబుల్‌లో జరగలేదు. అయితే టోర్నీని ఎంత కాలం ఆపగలం? ఎవరైనా కరోనా బారిన పడితే వారిని ఐసోలేట్‌ చేయడం, మిగతా వారితో మ్యాచ్‌లు కొనసాగించడమే సరైంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఫ్రాంచైజీలు కూడా సగం దూరం వచ్చాక వెనక్కి తగ్గే ప్రశ్నే లేదని చెబుతున్నాయి. ఆటగాళ్ల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుంటూనే టోర్నీలో ఆడతామని వారు చెబుతున్నారు. ఇకపై అన్ని జట్ల ఆటగాళ్లకు ప్రతీ రోజూ కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.

అదే కారణమా...
ఐపీఎల్‌ కోసం బీసీసీఐ గత ఏడాదిలాగే ఈసారి కూడా ప్రత్యేక బయో బబుల్‌లను ఏర్పాటు చేసింది. జట్ల ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో పాటు వారికి సౌకర్యాలు కల్పించే కొందరు వ్యక్తులు మాత్రమే ఈ బబుల్‌లో ఉంటారు. నిర్ణీత సమయం పాటు క్వారంటైన్, వరుస పరీక్షల్లో నెగెటివ్‌ ఫలితాలు వచ్చిన తర్వాతే అందరూ ఒక్కచోటికి చేరి ప్రాక్టీస్‌ చేయడం, ఆపై మ్యాచ్‌లు కొనసాగాయి. ఈ బయో బబుల్‌ అన్ని విధాలా సురక్షితమని బీసీసీఐ చెబుతోంది.

ఇద్దరు క్రికెటర్లు బబుల్‌ను దాటి బయటకు రావడం వల్లే అక్కడే కరోనా బారిన పడి ఉండవచ్చని సమాచారం. భుజం గాయంతో బాధపడుతున్న వరుణ్‌ చక్రవర్తి స్కానింగ్‌ కోసం బబుల్‌ను బయటి ఆసుపత్రికి వెళ్లి వచ్చాడు. నిజానికి ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం ఇలా వెళ్లినా ‘గ్రీన్‌ చానల్‌’ ప్రొటోకాల్‌ను పాటించాలి. బయో బబుల్‌లో భాగంగా ఉండే వాహనంలోనే అక్కడి సిబ్బంది సహాయంతో నేరుగా ఆసుపత్రికి వెళ్లి రావాలి. దీనిని ఉల్లంఘించడం వల్లే వరుణ్‌కు కరోనా సోకినట్లు తెలుస్తోంది.

ఆ ఇద్దరికి కూడా...
చెన్నై సూపర్‌ కింగ్స్‌ సీఈఓ కాశీ విశ్వనాథన్, బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీ, టీమ్‌ బస్సు డ్రైవర్‌ కూడా ముందుగా కరోనా పాజిటివ్‌గా తేలారు. అయితే తర్వాతి పరీక్షల్లో కాశీ విశ్వనాథన్‌కు నెగెటివ్‌ రాగా... మిగతా ఇద్దరు మాత్రం పాజిటివ్‌ అని ఖాయమైంది. సూపర్‌ కింగ్స్‌లోని ఇతర సభ్యులకు ఎలాంటి ఇబ్బంది లేదని... వారి రిపోర్టులన్నీ నెగెటివ్‌గానే వచ్చాయని యాజమాన్యం ప్రకటించింది. ఐపీఎల్‌ వేదికల్లో ఒకటైన ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానం గ్రౌండ్స్‌మెన్‌కు కరోనా వచ్చిందని వార్తలు వినిపించినా... డీడీసీఏ అధ్యక్షుడు రోహన్‌ జైట్లీ దీనిని ఖండిస్తూ, లీగ్‌ విధుల్లో ఉన్నవారెవరూ ఆ జాబితాలో లేరని స్పష్టం చేశారు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top