సరికొత్త శిఖరాలకు... | Year End RoundUp 2023: List Of Memorable Sporting Achievements By Indian Athletes In 2023 - Sakshi
Sakshi News home page

Sporting Achievements In 2023: సరికొత్త శిఖరాలకు...

Published Sat, Dec 30 2023 4:25 AM

2023 with memorable achievements - Sakshi

కాలక్రమంలో మరో ఏడాది గడిచిపోనుంది... ఒకప్పుడు ప్రాతినిధ్యానికి పరిమితమైన భారత క్రీడాకారులు... ఏడాదికెడాది తమ ప్రతిభకు పదును పెడుతున్నారు... అంతర్జాతీయ క్రీడా వేదికలపై అద్వితీయ ప్రదర్శనతో అదరగొడుతున్నారు. కొన్నేళ్లక్రితం వరకు అందని ద్రాక్షలా కనిపించిన స్వర్ణ, రజత, కాంస్య పతకాలను సగర్వంగా తమ మెడలో వేసుకుంటున్నారు.

మొత్తానికి ఈ ఏడాదీ భారత క్రీడాకారులు  విశ్వ క్రీడారంగంలో తమదైన ముద్ర వేసి సరికొత్త శిఖరాలకు  చేరుకున్నారు. ఊహించని విజయాలతో భారత క్రీడా భవిష్యత్‌  బంగారంలా ఉంటుందని విశ్వాసం కల్పించారు. కేవలం  విజయాలే కాకుండా ఈ సంవత్సరం కూడా వీడ్కోలు,  వివాదాలు భారత క్రీడారంగంలో కనిపించాయి.

రెండు దశాబ్దాలుగా భారత మహిళల టెన్నిస్‌కు ముఖచిత్రంగా ఉన్న సానియా మీర్జా ఆటకు వీడ్కోలు పలకడం... దేశానికి తమ పతకాలతో పేరు ప్రతిష్టలు తెచ్చిన మహిళా మల్లయోధులు తాము లైంగికంగా వేధింపులు ఎదుర్కొన్నామని వీధుల్లోకి రావడం... ఈ వివాదం ఇంకా కొనసాగుతుండటం విచారకరం.  –సాక్షి క్రీడా విభాగం

తొలిసారి పతకాల ‘సెంచరీ’ 
గత ఏడాదే జరగాల్సిన ఆసియా క్రీడలు కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి. చైనాలోని హాంగ్జౌ నగరం ఆతిథ్యమిచ్చిన ఈ క్రీడల్లో భారత బృందం తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఏకంగా 107 పతకాలతో ఈ క్రీడల చరిత్రలో తొలిసారి పతకాల సెంచరీ మైలురాయిని దాటింది. భారత క్రీడాకారులు 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు గెల్చుకున్నారు. ముఖ్యంగా ఆర్చరీ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మూడు స్వర్ణ పతకాలతో మెరిసింది. పీటీ ఉష తర్వాత ఒకే ఆసియా క్రీడల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ బంగారు పతకాలు గెలిచిన భారత క్రీడాకారిణిగా జ్యోతి సురేఖ గుర్తింపు పొందింది.  

బ్యాడ్మింటన్‌లో ఈ ఏడాది పురుషుల డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌ –చిరాగ్‌ శెట్టి అదరగొట్టింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో, ఆసియా క్రీడల్లో తొలిసారి డబుల్స్‌లో స్వర్ణ పతకాలు అందించిన ఈ ద్వయం స్విస్‌ ఓపెన్, ఇండియా ఓపెన్, ఇండోనేసియా ఓపెన్‌ టోర్నీల్లోనూ టైటిల్స్‌ సాధించింది. ఈ క్రమంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలిసారి నంబర్‌వన్‌ స్థానానికి ఎగబాకింది. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెల్చుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధుకు ఆశించిన ఫలితాలు లభించలేదు. ఆమె కేవలం ఒక టోర్నీలో (స్పెయిన్‌ మాస్టర్స్‌) మాత్రమే ఫైనల్‌ చేరి రన్నరప్‌గా నిలిచింది.  

నిఖత్‌ పసిడి పంచ్‌... 
గత ఏడాది తాను సాధించిన ప్రపంచ టైటిల్‌ గాలివాటం ఏమీ కాదని భారత స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ఈ సంవత్సరం నిరూపించింది. న్యూఢిల్లీ వేదికగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నిఖత్‌ మళ్లీ తన పంచ్‌ పవర్‌ చాటుకుంది. 50 కేజీల విభాగంలో నిఖత్‌ స్వర్ణం సాధించి వరుసగా రెండో ఏడాది ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ నాలుగు స్వర్ణాలు సాధించి ఓవరాల్‌ చాంపియన్‌గా అవతరించడం విశేషం. ఆసియా క్రీడల్లోనూ నిఖత్‌ రాణించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.  

మన బల్లెం బంగారం... 
భారత అథ్లెటిక్స్‌కు ఈ ఏడాది సూపర్‌గా గడిచింది. రెండేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి అందర్నీ అబ్బురపరిచిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా గత ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించి ఆశ్చర్యపరిచాడు. ఈ ఏడాది మరింత ఎత్తుకు ఎదిగిన నీరజ్‌ ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో ఏకంగా స్వర్ణ పతకంతో మెరిశాడు.

ఆగస్టులో బుడాపెస్ట్‌లో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో నీరజ్‌ జావెలిన్‌ను 88.17 మీటర్ల దూరం విసిరి విశ్వవిజేతగా అవతరించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళా అథ్లెట్‌ జ్యోతి యెర్రాజీ కూడా ఈ సంవత్సరం మెరిపించింది. బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించింది.  

సానియా అల్విదా... 
రెండు దశాబ్దాలుగా భారత టెన్నిస్‌కు ముఖచిత్రంగా నిలిచిన సానియా మీర్జా ఈ ఏడాది తన కెరీర్‌కు ముగింపు పలికింది. ప్రొఫెషనల్‌ ప్లేయర్‌ హోదాలో ఫిబ్రవరిలో దుబాయ్‌ ఓపెన్‌లో ఆమె చివరిసారిగా బరిలోకి దిగింది. మార్చి 5వ తేదీన సానియా కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వీడ్కోలు మ్యాచ్‌ ఏర్పాటు చేశారు. గతంలో డబుల్స్‌లో తన భాగస్వాములుగా ఉన్న ఇవాన్‌ డోడిగ్, కారా బ్లాక్, బెథానీ మాటెక్, రోహన్‌ బోపన్నలతో కలిసి సానియా ఈ వీడ్కోలు మ్యాచ్‌ ఆడింది.   

మాయని మచ్చలా... 
ఈ ఏడాది జనవరి 18న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద భారత మహిళా రెజ్లర్లు ఆందోళనకు దిగారు. భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపిస్తూ ఆసియా చాంపియన్‌ వినేశ్‌ ఫొగాట్, రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి మలిక్, బజరంగ్‌ పూనియా, సంగీత ఫొగాట్‌ తదితరులు ఆందోళన చేపట్టారు. అనంతరం క్రీడా శాఖ కమిటీ ఏర్పాటు చేసి రెజ్లర్ల ఆరోపణలపై విచారణ చేపట్టారు.

బ్రిజ్‌భూషణ్‌ సమాఖ్య అధ్యక్ష పదవి నుంచి వైదొలిగినా ఆయనపై మాత్రం ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. తాజాగా రెజ్లింగ్‌ సమాఖ్య కొత్త అధ్యక్షుడిగా బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ విధేయుడు సంజయ్‌ సింగ్‌ ఎన్నిక కావడంతో రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సాక్షి మలిక్‌ తాను రెజ్లింగ్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించింది. బజరంగ్‌ పూనియా, వినేశ్‌ ఫొగాట్‌ తమ ‘ఖేల్‌రత్న, పద్మశ్రీ, అర్జున’ పురస్కారాలను వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించారు.   

Advertisement
 

తప్పక చదవండి

Advertisement