
న్యూఢిల్లీ: భారత క్రీడా రంగంలో అత్యున్నత వ్యక్తిగత గౌరవంగా భావించబడే మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు 2025 సవరణ మార్గదర్శకాలను యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీటి ఆధారంగా అర్హులైన క్రీడాకారులు మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు కోసం దరకాస్తు చేసుకునే అవకాశం కేంద్రం కల్పించింది.
ఈ అవార్డు, అంతర్జాతీయ స్థాయిలో అసాధారణ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను గౌరవించడానికి ప్రతి సంవత్సరం ప్రదానం చేయబడుతుంది. దీని కోసం క్రీడాకారులు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ అవార్డు గెలుచున్నవారికి రూ. 25 లక్షల నగదు బహుమతి (ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు), గౌరవ పత్రం, పతకం (మెడల్) అందచేయబడతాయి.
లక్ష్యం
ఖేల్ రత్న అవార్డు ప్రధాన ఉద్దేశ్యం, గత నాలుగేళ్లలో అత్యద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన క్రీడా ప్రదర్శన చేసిన భారత క్రీడాకారులను గుర్తించి గౌరవించడం.
ఒలింపిక్, కామన్వెల్త్ మరియు ఆసియా గేమ్స్‌లో జరిగే సంవత్సరాల్లో, ఆ గేమ్స్ ముగిసే వరకు సాధించిన విజయాలు కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
అర్హులు ఎవరు?
గత నాలుగేళ్లలో అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట ప్రతిభ కనబరిచిన క్రీడాకాులు అర్హులు.
ఒలింపిక్, వరల్డ్ కప్, కామన్వెల్త్, ఆసియా గేమ్స్ వంటి అంతర్జాతీయ పోటీల్లో సాధించిన విజయాలు ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించిన వారు శిక్షా కాలం పూర్తయిన తర్వాత మాత్రమే అర్హులు అవుతారు.
ఎంపిక ప్రక్రియలో తుది నిర్ణయం సంబంధిత కమిటీ తీసుకుంటుంది, ఈ కమిటీలో మాజీ క్రీడాకారులు, క్రీడా జర్నలిస్టులు, పరా స్పోర్ట్స్ నిపుణులు, టార్గెట్ ఒలింపిక్ పోడియం (TOPS) ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డులు ప్రతి సంవత్సరం ఆగస్టు 29న, భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జన్మదినం సందర్భంగా, రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం చేయబడతాయి.