ఇంగ్లండ్‌ బౌలర్‌ అరుదైన రికార్డు.. 149 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే | 1st Time In 149 Years: England Pacer Scripts History With Stunning Over vs New Zealand | Sakshi
Sakshi News home page

ENG vs NZ: ఇంగ్లండ్‌ బౌలర్‌ అరుదైన రికార్డు.. 149 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే

Jun 6 2026 8:12 AM | Updated on Jun 6 2026 8:49 AM

1st Time In 149 Years: England Pacer Scripts History With Stunning Over vs New Zealand

లార్డ్స్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ స్టార్‌ పేస‌ర్ ఓలీ రాబిన్సన్ అద‌ర‌గొట్టాడు.  దాదాపు రెండేళ్ల త‌ర్వాత రీఎంట్రీ ఇచ్చిన రాబిన్సన్ త‌న అద్భుత బౌలింగ్‌తో కివీస్ బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన రాబిన్సన్.. ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాటర్లను అవుట్ చేసి పర్యాటక జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టాడు. 

ఆ ఓవర్‌లో మూడో బంతికి కాన్వేను, ఐదో బంతికి విలియమ్సన్‌ను, ఆరో బంతికి రవీంద్రను అవుట్ చేసి 'త్రీ-వికెట్ మెయిడెన్' ఓవర్‌ను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతడికి అది తొలి ఓవర్ కావడం విశేషం. దీంతో రాబిన్సన్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. 

149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో తాను వేసిన తొలి ఓవర్లోనే 3 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మొదటి ఇంగ్లీష్ బౌలర్‌గా రాబిన్సన్ రికార్డు సృష్టించాడు. జిమ్మీ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ వంటి దిగ్గజాలకు కూడా సాధ్యం కాని ఘనత ఇది. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో రాబిన్సన్ ఏడో స్ధానంలో నిలిచాడు.

తొలి ఓవర్‌లోనే మూడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లు

నువాన్ జోయ్సా (శ్రీలంక)

ఇర్ఫాన్ పఠాన్ (భారత్ - హ్యాట్రిక్)

డానియల్ వెట్టోరి (న్యూజిలాండ్)

హారిస్ సోహైల్ (పాకిస్తాన్)

మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)

స్కాట్ బోలాండ్ (ఆస్ట్రేలియా)

ఓలీ రాబిన్సన్ (ఇంగ్లాండ్)

ఇక​ మ్యాచ్ విషయానికి వస్తే.. వరుసగా రెండో రోజు కూడా బౌలర్ల హవా కొనసాగింది. పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై తొలి రోజు 16 వికెట్లు నేలకూలగా... శుక్రవారం రెండో రోజు 17 వికెట్లు పడ్డాయి. ఓవర్‌నైట్‌ స్కోరు 61/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన న్యూజిలాండ్‌... 29.5 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. కైల్‌ జేమీసన్‌ (29 బంతుల్లో 38 నాటౌట్‌; 2 ఫోర్లు,  3 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌ కాగా... గ్లెన్‌ ఫిలిప్స్‌ (34) ఫర్వాలేదనిపించాడు.

ఇంగ్లండ్‌ బౌలర్లలో రాబిన్‌సన్‌ 39 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌... ఈసారి కాస్త మెరుగ్గా ఆడింది. ప్రత్యర్థి బౌలర్లు పరీక్షిస్తున్నా ఆతిథ్య జట్టు బ్యాటర్లు ఎదురు నిలిచారు. దీంతో ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 56 ఓవర్లలో 226 పరుగులకు ఆలౌటైంది.

అరంగేట్రం ఆటగాడు ఎమిలియో (95 బంతుల్లో 57; 8 ఫోర్లు) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకోగా... బెన్‌ డకెట్‌ (33), జెమీ స్మిత్‌ (39) రాణించారు. కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (0), హ్యారీ బ్రూక్‌ (0), జో రూట్‌ (8), బెథెల్‌ (14) విఫలమయ్యారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో నాథన్‌ స్మిత్‌ 6 వికెట్లతో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో కలుపుకొని ఇంగ్లండ్‌ జట్టు... ప్రత్యర్థి ముందు 254 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.

ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 11.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ (0), కేన్‌ విలియమ్సన్‌ (18); రూర్కె (0) పెవిలయన్‌ చేరగా... కాన్వే (12 బ్యాటింగ్‌; 1 ఫోర్‌) పోరాడుతున్నాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో అట్కిన్సన్‌ 2 వికెట్లు తీశాడు. చేతిలో 7 వికెట్లు ఉన్న న్యూజిలాండ్‌ విజయానికి ఇంకా 218 పరుగులు చేయాల్సి ఉంది.    

Advertisement
 
Advertisement
Advertisement