YouTube Report: యూట్యూబ్‌తో వినోదం, వ్యాపారం, సమాజ సేవ.. ఇది తెలుసుకోండి

Business as well as Social service with YouTube - Sakshi

ఒకప్పుడు యూట్యూబ్‌ అంటే.. కేవలం వినోదం మాత్రమే!. మరి ఇప్పుడు.. వార్తలు.. వ్యాపారం.. విహారం అన్నీ అందులోనే. కానీ కొందరు కంటెంట్‌ క్రియేటర్లు.. ఇటు డబ్బు సంపాదనతోపాటు అటు సామాజిక సేవకూ తోడ్పడుతున్నారు. యూట్యూబ్‌ ఇటీవల విడుదల చేసిన ఇంపాక్ట్‌ రిపోర్ట్‌ ప్రకారం.. దక్షిణ భారతంలో సమాజంపై తమ ప్రభావాన్ని చూపిన చానెళ్లలో కొన్ని ఇవీ.. 

సృజనాత్మకతను ప్రోత్సహించే లక్ష్యంతో యూట్యూబ్‌ 2007లో మొదలుపెట్టిన పార్టనర్‌ షిప్‌ ప్రోగ్రామ్‌ ఇప్పుడు శాఖోపశాఖలుగా విస్తరించింది. తమలోని కళ, నైపుణ్యాలను ప్రపంచానికి చూపేందుకు క్రియేటర్లు చానళ్లు మొదలుపెట్టారు. ఈ క్రమంలో క్రియేటర్లు ఎంతో కొంత ఉపాధి పొందడం మొదలైంది. కొందరు వంటలు చేయడం ద్వారా లక్షల మందిని ఆకర్షించి డబ్బులు వెనకేస్తుంటే.. మరికొందరు ఇంగ్లిషు పాఠాలు బోధిస్తూ సంపాదిస్తున్నారు.

ఈ నేపథ్యంలో యూట్యూబ్‌ రెండేళ్ల క్రితం ఒక అధ్యయనం చేపట్టింది. యూట్యూబ్‌ క్రియేటర్ల ద్వారా ఆర్థిక వ్యవస్థలకు చేకూరుతున్న మేలు ఏమిటనేదానిపై ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ విభాగంతో కలిసి అధ్యయనం చేసి.. ఇంపాక్ట్‌ రిపోర్ట్‌ రూపొందించింది. దాని ప్రకారం.. మన దేశంలో 6.83 లక్షల మందికి ప్రత్యక్ష/పరోక్ష ఉపాధి లభించడానికి యూట్యూబ్‌ క్రియేటర్లు కారణమయ్యారు. వీరిద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు రూ.6,800 కోట్లు సమకూరినట్టు అంచనా వేశారు. యూట్యూబ్‌లోని 40 వేలకుపైగా చానళ్ల నిర్వాహకులు నెలకు రూ.లక్ష కంటే ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారని ఆ నివేదిక తెలిపింది. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన అలాంటి క్రియేటర్లు, చానళ్లలో కొన్ని ఇవి.. 

స్పోకెన్‌ ఇంగ్లిష్‌కు ‘కైజెన్‌ ఇంగ్లిష్‌’ 

తమిళనాడుకు చెందిన మలర్‌ సృష్టించిన చానల్‌ ఇది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కాలేజీకి కూడా వెళ్లలేని మలర్‌.. దూరవిద్య కోర్సుల ద్వారానే డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత టీచర్‌గా ఉపాధి పొందారు కూడా. ఆ సమయంలో ఇంగ్లిష్‌ రాకపోవడం వల్ల తాను పడ్డ కష్టాలు ఇతరులకు రావొద్దన్న సంకల్పంతో ‘కైజెన్‌ ఇంగ్లిష్‌’ పేరిట యూట్యూబ్‌ చానల్‌ మొదలుపెట్టారు. తమిళంలో మాట్లాడుతూ ఇంగ్లిష్‌ భాషను బోధిస్తున్నారు. ప్రస్తుతం ఈ చానెల్‌కు 9.77 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ చానల్‌ ద్వారా కోచింగ్‌ పొందిన తాము ఉద్యోగ ఇంటర్వ్యూలను విజయవంతంగా ఎదుర్కొన్నామని, ఇతరులతో ఇంగ్లిషులో ధీమాగా మాట్లాడటం అలవాటు చేసుకున్నామని సబ్‌స్క్రైబర్లు చెప్తుండటం గమనార్హం. 

స్ఫూర్తినిచ్చే.. తెలుగు గీక్స్‌ 
ఆయన పేరు పోతుల ఫణిదీప్‌.. వైద్యుడు.. కొన్నేళ్ల క్రితం ఆస్పత్రిలో పనిచేస్తుండగా వేళ్లు వణుకుతున్నట్టు గుర్తిం చారు. ‘అమయోట్రోపిక్‌ లాటెరల్‌ స్కెలరోసిస్‌ (ఏఎల్‌ఎస్‌)’ఉన్నట్టు తేలడంతో ఉద్యో గం వదిలేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఫణిదీప్‌ తన నిరాశ, నిస్పృహలను దూరం చేసుకునేందుకు యూట్యూబ్‌ చానల్‌ మొదలుపెట్టాడు. వ్యక్తిత్వవికాసానికి దోహదపడే వీడి యోలు రూపొందించారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుస్తకాల విషయాలను తెలుసుకోండి ఉచితంగా.. అని తెలుగులో రాసిన కవర్‌పేజీతో వచ్చే తెలుగు గీక్స్‌కు దాదాపు 14 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఫణిదీప్‌ నెలసరి ఆదాయం రూ.1.5లక్షలు.
www.youtube.com/c/ TeluguGeeks/ featured 

ఎం4టెక్‌.. సైన్స్‌ పాఠాలతో.. 
పిల్లలకు ఆసక్తికర రీతిలో సైన్స్‌ పాఠాలు అందించే లక్ష్యంతో కేరళకు చెందిన జియోజోసెఫ్‌ మొదలుపెట్టిన చానల్‌ ఇది. సొంతంగా చేసుకోగల శాస్త్రీయ పరిశోధనలే ఈ చానల్‌ కంటెంట్‌. ఒక వీడియో బాగా వైరల్‌ కావడంతో జోసెఫ్‌ తన మిత్రుడు ప్రవీణ్‌తో కలిసి మరింత కంటెంట్‌ను రెగ్యులర్‌గా అందించడం మొదలుపెట్టాడు. తక్కువ కాలంలోనే చానల్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 74 లక్షలకు చేరుకుంది. నెలకు రూ.లక్షల్లో ఆదాయమూ తెచ్చిపెడుతోంది. ఎం4టెక్‌ చానల్‌లోని వీడియోల స్ఫూర్తితో ఇప్పుడు విద్యార్థులు సైన్స్‌ పోటీలకు సిద్ధమవుతున్నారంటే దాని ప్రభావం ఏమిటన్నది అర్థమైపోతుంది. 
https://www.youtube.com/c/M4Techofficial

అనాథలకు అన్నం పెడుతున్న నవాబ్స్‌ కిచెన్‌ 
తెలంగాణకు చెందిన ఖ్వాజా మొయినుద్దీన్‌ స్థాపించిన యూట్యూబ్‌ చానల్‌.. కేవలం వంటల గురించి చెప్పేది మాత్రమే కాదు, ఈ క్రమంలోనే అనాథల కడుపులూ నింపుతోంది. తమ చానల్‌లో ప్రసారం చేయడం కోసం.. పెద్ద మొత్తాల్లో బిరియానీ, పలావ్‌ వంటి వంటలు వండటం, తర్వాత ఆ వంటను అనాథ పిల్లలకు పంచి పెట్టడం.. ఇదీ నవాబ్స్‌ కిచెన్‌ పనిచేసే తీరు. ఖ్వాజా మొయినుద్దీన్‌ తన మిత్రులతో కలిసి ఈ చానల్‌ మొదలుపెట్టారు. ఉద్యోగం మానేయడంతోపాటు మరెన్నో సమస్యలు వచ్చినా ఎదుర్కొని ముందుకు సాగిన ఖ్వాజాకు ఇప్పుడు తన చానల్‌ ద్వారా స్థిరమైన ఆదాయం లభిస్తోంది. అటు అనాథలకూ ఆహారం అందివ్వగలుగుతున్నాడు. ఇదీ చానల్‌ లింకు.. 
https://www.youtube.com/c/ NawabsKitchenFoodForAllOrphans

 - సాక్షి, హైదరాబాద్‌

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top