అనుమతులు నిల్..
● లైసెన్స్‌లు తీసుకోకుండా పంచాయతీ ఆదాయానికి గండి
● దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యాపారాలు
షాపు నిర్వాహకుడికి నోటీసు ఇస్తున్న
పంచాయతీ కార్యదర్శి
సిద్దిపేటఅర్బన్: ఏ వ్యాపారం చేయాలన్నా, చిన్న పాన్ డబ్బా మొదలుకుని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నడపాలన్నా ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి. అలాంటిది రాజీవ్ రహదారి వెంట ఉన్న పలు వ్యాపారాల నిర్వాహకులు ట్రేడ్ లైసెన్స్‌లు లేకుండానే వ్యాపారాలు చేసేస్తున్నారు. దశాబ్దాలుగా వ్యాపారాలు కొనసాగిస్తుండటంతో రాజీవ్ రహదారి వెంట ఉన్న ఆయా గ్రామాల ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండానే కొనసాగుతున్న వ్యాపారుల జేబులు మాత్రం దండిగా నిండుతున్నాయి. ఇలా సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోనే ఏటా రూ.లక్షల్లో ఆదాయం నష్ట పోతున్నట్టు తెలుస్తోంది.
ఆన్‌లైన్‌లోనే ట్రేడ్ లైసెన్స్‌కు రిజిస్ట్రేషన్
ఆదాయ వనరుల పెంపుతోపాటు, పన్ను వసూళ్లలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం గతంలోనే ట్రేడ్ లైసెన్స్‌లకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పద్ధతిని తీసుకువచ్చింది. అంతకుముందు అధికారులు మాన్యువల్ పద్ధతిలో వ్యాపార కేంద్రాలస్థాయి ప్రకారం లైసెన్స్ ఫీజు వసూలు చేసేవారు. మాన్యువల్ పద్ధతిలో కొందరు తీసుకుంటున్నా, ఆన్‌లైన్‌లో తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో ట్రేడ్ లైసెన్స్‌ల జారీలో పారదర్శకత లోపిస్తోంది. ట్రేడ్ లైసెన్స్ కోసం వ్యాపారులు వారి వారి టర్నోవర్ ప్రకారం ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులు వాటిని పరిశీలించి లైసెన్స్‌లు మంజూరు చేస్తారు.
టాక్స్ చెల్లింపుల్లోనూ కోతలే...
వ్యాపారులు కొందరు ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండా వ్యాపారాలు నిర్వహిస్తుంటే ట్రేడ్ లైసెన్స్‌లు తీసుకున్న మరికొందరు వ్యాపారులు టాక్స్ చెల్లింపుల్లో కోతలు పెడుతున్నారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తూ వాస్తవ విస్తీర్ణం కంటే తక్కువ విస్తీర్ణం చూపిస్తూ పన్నులు చెల్లిస్తున్నారు. మరికొందరు రేకుల షెడ్డులను చూపిస్తూ తాత్కాలిక నిర్మాణాల పేరిట పన్నులు ఎగవేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు పక్కాగా విచారణ జరిపించి వాస్తవ విస్తీర్ణం ప్రకారం పన్ను చెల్లించేలా చర్యలు తీసుకోవడంతోపాటు ట్రేడ్ లైసెన్స్‌లు తీసుకునేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.


