● ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
● టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత
● పార్టీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేసి రాజకీయంగా ఇక్కడ విజయకేతనం ఎగురవేస్తామని టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత తెలిపారు. జిల్లా నాయ కులు ఊరురా వెళ్లి పాంచజన్య సంకల్పాన్ని ప్రచారం చేయాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో శుక్రవా రం టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు.
అంతకుముందు శ్రీఉమాపార్థీవ కోటిలింగాల ఆలయం, సీఎస్‌ఐ చర్చి, జైనుల్లాహ్ దర్గాకి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...పుట్టిన ఇల్లు కాదన్నా, పుట్టిన ఊరు చింతమడక ప్రజలు బతుకమ్మకు ఆహ్వానించి ఆశీర్వదించారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సిద్దిపేటలో పోటీ చేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్, గౌరవెల్లి, గండిపల్లి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై అప్పుడు నిపుణులు ఇచ్చిన సలహాలను పట్టించుకోకుండా నాటి ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు నిర్మాణం చేశారని, ఇపుడు ప్రాజెక్టుకు అపాయం రాగానే ఇతరులపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. 330 కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి వరి ధాన్యం కొనుగోలు చేసేలా టీఆర్‌ఎస్ నాయకులు కృషి చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు లోక రవిచంద్ర, సిద్దిపేట నియోజకవర్గ ఇన్ చార్జి మల్లారెడ్డి, బాలమణి తదితరులు పాల్గొన్నారు.


