● మిల్లులకు ట్యాగింగ్ పూర్తి చేయాలి
● ఎమ్మెల్యే డా.పల్లా రాజేశ్వర్‌రెడ్డి
చేర్యాల(సిద్దిపేట): వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి కొనుగోళ్లు చేపట్టాలని ఎమ్మెల్యే డా.పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ ముస్త్యాల అరుణతో కలిసి మాట్లాడుతూ...గ్రామాల్లో వరి కోతలు పూర్తైనా ధాన్యం కేంద్రాల్లో పోసిన రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలను మిల్లుల ట్యాగింగ్ పూర్తి చేసి, సన్న వడ్ల బోనస్‌పై వెంటనే జీవో విడుదల చేయాలని కోరారు. గత యాసంగి బోనస్ కూడా రైతులకు చెల్లించలేదని, వెంటనే బోనస్ రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో ధాన్యం కొనుగోలు చేసే దళారులు సిండికేట్‌గా మారి ధాన్యం ధరలు తగ్గిస్తున్నారని, రైతులు తొందరపడి తక్కువ ధరకు విక్రయించవద్దని సూచించారు. కలెక్టర్‌తో మాట్లాడి కొనుగోలు కేంద్రాల సమస్యను వివరించానని, వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ లభించిందన్నారు. తపాసుపల్లి రిజర్వాయర్ నుంచి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో వైస్ చైర్పర్సన్ ఉమ, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు సుప్రజ తదితరులు పాల్గొన్నారు.


