వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ హైమావతి
సిద్దిపేటరూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్దిపేట పర్యటనలో భాగంగా ప్రారంభించనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాను విజయవంతంగా అమలు చేస్తామని కలెక్టర్ కె.హైమావతి ఉన్నతాధికారులకు తెలిపారు. హైదరాబాద్‌లోని డాక్టర్.బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో కలిసి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ కె.హైమావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 19న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సిద్దిపేట జిల్లా నుంచి ప్రారంభించనున్నారన్నారు. దీనికోసం అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, జెడ్పీ సీఈఓ రమేశ్, మెప్మా పీడీ హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం సభా స్థల ఏర్పాట్లపై కలెక్టర్ ఆరా
సిద్దిపేటజోన్: ఈ నెల 19న జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. జిల్లా పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్‌తో కలిసి కలెక్టర్ హైమావతి సభాస్థలాన్ని ఎంపిక చేశారు. ఇటీవల గుర్తించిన స్థలానికి ఎదురుగా చిన్నగుండవెళ్లి మార్గంలో ఉన్న 16 ఎకరాల స్థలానికి వేదిక అనివార్య కారణాల వల్ల మార్పు జరిగినట్లు తెలిపారు. స్థలాన్ని త్వరితగతిన చదును చేసి పరిధులు నిర్ణయించాలని ఆదేశించారు. సభా వేదిక, పార్కింగ్, తదితర అంశాలపై మ్యాప్ సిద్ధం చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి హరికృష్ణ, ఆర్డీఓ సదానందం, ఏసీపీ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, తహసీల్దార్ హరికిరణ్, పోలీసు, సర్వే, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.


