మంత్రులకు నిర్వాసితుల వినతిపత్రం
గజ్వేల్: పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని జిల్లాలోని మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, అనంతగిరి, కొండపోచమ్మసాగర్, గౌరవెల్లి రిజర్వాయర్ల నిర్వాసితులు మంత్రులు దామోదర, వివేక్‌కు వినతి పత్రాలను అందజేశారు. శనివారం హైదరాబాద్‌లోని వారి నివాసాల్లో మంత్రులను కలిశారు. ఈ సందర్భంగా నిర్వాసితులు తమ గోడు చెప్పుకున్నారు. ఇప్పటికీ వ్యవసాయ భూములు, నిర్మాణాలకు సంబంధించిన పరి హారాలు పెండింగ్‌లో ఉన్నాయని..వడ్డీతో సహా తమకు చెల్లించాలని, ఆర్‌అండ్‌ఆర్ కాలనీలను అప్రూవల్–లేఅవుట్లుగా మార్చి ఇంటి పన్నును శాశ్వతంగా రద్దు చేయాలని, రైతు కూలీలకు ఏటా రూ.12వేలు అందించాలని, తదితర అంశాలను మంత్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాసిత కాలనీలకు చెందిన హయతోద్దీన్, శ్రీనివాస్‌రెడ్డి, అశోక్ తదితరులున్నారు.
భారత మాజీ క్రికెటర్ సునీత
సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలోని క్రికెట్ స్టేడియం చాలా బాగుందని భారత మహిళ క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మహిళ జట్టు ఇన్‌చార్జి సునీత పేర్కొన్నారు. శనివారం ఆమె క్రికెట్ స్టేడియాన్ని సందర్శించి అక్కడి వసతుల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 200మంది మహిళా క్రికెటర్లకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. వారిలో వందమంది ప్రతిభ కలిగిన వారిని ఎంపిక చేసి అసోసియేషన్ ఆధ్వర్యంలో బీసీసీఐ నిర్వహించే టోర్నీలో ప్రాతినిధ్యం వహించేలా లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. సిద్దిపేట స్టేడియంలో ప్రాక్టీసు మ్యాచ్‌లు జరిగేలా ప్రతిపాదన ఉందన్నారు. తెలంగాణ మహిళా క్రికెట్ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందన్నారు. ఆమె వెంట సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
మద్దూరు(హుస్నాబాద్): మండలంలోని లద్నూరు గ్రామానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, విశ్రాంత ఉపాధ్యాయుడు ప్రతికంఠం రామ్మూర్తి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కాగా, ఈయనకు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ డీజీపీ పేర్వారం రాములుతోపాటు ఎంతోమందికి రామ్మూర్తి పాఠాలు బోధించారు. ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ పొందిన వెంటనే 1996లో తన స్వగ్రామంలోనే పూర్వ విద్యార్థుల సహకారంతో సూర్యనలంద అనే ప్రైవేటు జూనియర్ కళాశాలను స్థాపించి గ్రామీణ నిరుపేద విద్యార్థులకు ఉచితంగా విద్యాబుద్ధులు నేర్పిన గొప్ప గురువుగా ఈ ప్రాంతంలో ఖ్యాతికెక్కారు. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా రామ్మూర్తికి ఎంతో మంది శిష్యులున్నారు. ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికి రామ్మూర్తి చేసిన కృషిని పలువురు గుర్తు చేసుకున్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి పోన్నాల లక్ష్మయ్యలు రామ్మూర్తి కుటుంబాన్ని ఫోన్‌లో పరామర్శించారు.
కార్యదర్శి సస్పెన్షన్
పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు
చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని రాంపూర్ గ్రామ కార్యదర్శి భూక్య మధును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు స్థానిక ఎంపీడీఓ ప్రణయ్‌కుమార్ తెలిపారు. పలు సర్టిఫికెట్ల జారీలో అవకతవకలకు పాల్పడటంతో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారన్నారు. కార్యదర్శి మధు, గ్రామానికి చెందిన శవల్ల రమేశ్ కలిసి ప్రస్తుతం జీవించి ఉన్న 22 మందికి సంబంధించి మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసినట్లు తమ విచారణలో తేలిందన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వీరిద్దరిపై పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.


