● ఘనంగా మన ఇందిరమ్మ ఇళ్లల్లో దీపావళి వేడుకలు
● పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్: పేదల సొంతింటి కలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా పాలన ప్రభుత్వం సాకారం చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలోని 12వ వార్డులో పొన్నం కోమల సమ్మయ్య ముదిరాజ్ దంపతుల ఇందిరమ్మ ఇంటిలో ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుక’లను ఘనంగా నిర్వహించారు. మంత్రి లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించి స్వీట్లు తినిపించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గంలోని అభివృద్ధి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ప్రజావాణిలో అందుతున్న వినతులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..నియోజకవర్గంలో మొదటి దశలో 3,500 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటివరకు 2,500 పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పారు. రెండవ దశలో మరో 1,000 ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ ఇళ్లకు పది రోజుల్లో లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందిస్తామని తెలిపారు.
ప్రతీ దరఖాస్తును రికార్డు చేయాలి
ప్రజావాణిలో వచ్చే ప్రతీ దరఖాస్తును రికార్డు చేయాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఏదో ఒక మండలంలో తాను స్వయంగా పాల్గొంటానని తెలిపారు.
ఉచిత ఉపకరణాల పంపిణీ
ఈ నెల 16న సైదాపూర్, 17న ఎల్కతుర్తి, 18న అక్కన్నపేట, 19న భీమదేవరపల్లి, 20న కోహెడ, 25,26న హుస్నాబాద్ పట్టణంలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అలింకో ఆధ్వర్యంలో నియోజకవర్గంలో వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత ఉపకరణాలు అందించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఆర్డీఓ రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ మండలాల ఎంపీడీఓలు పాల్గొన్నారు.


