● ఆకాశాన్ని అంటుతున్న టపాకాయల ధరలు
● అయినా భారీ ఎత్తున కొనుగోలు చేస్తున్న వినియోగదారులు
● తగ్గిన బంతి, పెరిగిన చామంతి ధరలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఇంటింటా వెలుగులు నింపే దీపావళి పండుగను ఆదివారం జిల్లావ్యాప్తంగా నిర్వహించుకునేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. అందుకుగాను ఆలయాలు, గృహాలను అందంగా ముస్తాబు చేశారు. దీపాలాంకరణలు చేసేందుకు భక్తులు మట్టి ప్రమిదలను కొనుగోలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులు, మార్కెట్‌లలో పూలు, మట్టి ప్రమిదల కొనుగోళ్లతో సందడిగా మారాయి. ఈ దీపావళికి ప్రధానంగా బంతిపూలను విరివిగా పూజల్లో వినియోగిస్తారు. అందుకనుగుణంగా బంతిపూలు మార్కెట్లలో పోటెత్తాయి. దీంతో కిలో బంతి పూలు రూ.50కే విక్రయిస్తున్నారు. చామంతి పూల ధరలు ఈ దీపావళికి పెరిగాయి. ప్రస్తుతం చామంతి పూలు కిలోకు రూ.250కి విక్రయిస్తున్నారు. దీపాలు వెలిగించే ప్రమిదల ధరలు రూ.2 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. విద్యుత్ దీపాలు, చైనా దీపాలు మార్కెట్‌లోకి భారీగా వచ్చాయి. వీటి ధరలు ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయి. దీపావళి పండుగను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని అనేక పాఠశాలల్లో ముందస్తు దీపావళి ఉత్సవాలను నిర్వహించారు. దీంతో జిల్లాలో ముందుగానే దీపావళి శోభ సంతరించుకుంది.
సిద్దిపేట పట్టణంలో పూలు, ప్రమిదలను కొనుగోలు చేస్తున్న ప్రజలు


