హుస్నాబాద్: కొత్తగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిలో లబ్ధిదారులు మురిసిపోతూ దీపావళి సంబరాలు చేసుకుంటుంటే, డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులు మాత్రం సొంతింటి కల నెరవేరలేక దిగాలుగా ఉన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులు ఇంటిముందు టపాసులు కాల్చుతూ వెలుగులు నింపుకుంటున్నారు. డబుల్ లబ్ధిదారులు మాత్రం అద్దె ఇంటిలో నిరాశలో ఉన్నారు. పేదింటి కలను సాకారం చేసేందుకు ఏ ప్రభుత్వం వచ్చిన ఆ ప్రభుత్వాలు పథకాలకు తీరోక్క పేర్లు పెట్టి పేదలకు ఇళ్లు కట్టిస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూం పథకం, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పథకం పేరిట ఇళ్లు మంజూరు చేసి గూడును కల్పిస్తున్నారు. ఇక్కడ మాత్రం ఐదేళ్ల కాలం నుంచి డబుల్ బెడ్రూం ఇళ్లు అసంపూర్తిగా మిగిలిపోయాయి. గత ప్రభుత్వంలో 560 ఇళ్లు మంజూరు కాగా, 263మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలిచ్చారు. ఇందులో 167 ఇళ్లు పూర్తి చేసి పట్టాలు కూడా ఇచ్చారు. మిగిలిన 96 ఇళ్లు స్లాబ్ వరకు నిర్మించి వదిలిపెట్టారు.
డబుల్ మరిచిన ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేస్తుందని లబ్ధిదారులు ఆశ పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లకు ప్రాధాన్యతనిస్తూ, డబుల్ బెడ్రూం ఇళ్లను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను స్లాబ్‌వరకు నిర్మాణం చేపట్టి వదిలేశారు. వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. ఇంటి తలుపులు, కిటికీలు, టాయిలెట్లు, కరెంట్ సౌకర్యం, కల్పించాల్సి ఉంది. ఇళ్ల పట్టాలు పొందిన నిరుపేదలు ఇప్పటికీ అద్దె ఇళ్లలో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పట్టాలు పొందిన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకుంటే, గతంలోనే ఇళ్ల పట్టాలు పొందినట్లు ఆన్‌లైన్‌లో చూపుతుండటంతో రెండు పథకాలకు దూరమవుతున్నారు. స్లాబ్‌వరకు ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల పూర్తి కోసం ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో లబ్ధిదారులు నిరాశకు లోనవుతున్నారు. కొత్తగా ఇందిరమ్మ ఇళ్లకు నిధులు మంజూరు చేస్తూ, అసంపూర్తిగా ఉన్న బెడ్రూం ఇళ్లను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించడం సబబు కాదని లబ్ధిదారులు వాపొతున్నారు.
ఇళ్లను పరిశీలించిన హౌసింగ్ పీడీ
మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను హౌసింగ్ శాఖ పీడీ భగవంత్‌రావు, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్ శనివారం పరిశీలించారు. స్లాబ్ వరకు పనులు పూర్తయిన 96 ఇళ్లను పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న రేట్లకు ఇళ్లను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్ ఎవరూ ముందుకువచ్చే పరిస్థితి లేదన్నారు. హౌసింగ్ డీఈ, ముగ్గురు ఏఈలతో కమిటీ వేసి, పెండింగ్ పనులపై నివేదిక తయారు చేసి హౌసింగ్ ఎండీకి పంపిస్తామన్నారు. బిల్లులను లబ్ధిదారులకు నేరుగా ఇవ్వడానికి అనుమతి తీసుకుంటామని తెలిపారు. త్వరలో లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి పెండింగ్ పను లు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఐదేళ్లుగా అసంపూర్తిగా డబుల్ బెడ్రూం ఇళ్లు
ఇళ్ల కోసం లబ్ధిదారుల ఎదురుచూపులు
ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు


