● మార్కెట్ యార్డుల్లో వసతులు కరువు
● మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
సిద్దిపేటజోన్: రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందని, ఇప్పటికీ రవాణ టెండర్ ప్రక్రియ లేదని, మిల్లుల కేటాయింపు జరగలేదని ధాన్యం ఎక్కడ నిల్వ చేయాలనేది ఖరారు కాలేదంటూ ప్రభుత్వ తీరుపై మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. స్థానిక మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..పండిన పంటను అమ్ముకోవడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదన్నారు. సన్న రకం వడ్లను వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని, దొడ్డు రకం పండించిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో వసతులు లేవన్నారు. ప్యాడీక్లీనర్లు, తేమ యంత్రాలు, టార్పాలిన్ కవర్లు లేవని విమర్శించారు. రెవెన్యూ, సివిల్ సప్లయ్, డీఆర్డీఏ, కో ఆపరేటివ్ అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో వెళ్లి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. పంట నష్టం కల్గిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, సిద్దిపేట మార్కెట్ కమిటీ సెక్రెటరీ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, సాయిరాం, పట్టణ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్ అధికారులు, రైతులు పాల్గొన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో పక్షవాతంతో బాధపడుతున్న ఒక వ్యక్తికి ఫిజియో మెషీన్ అందించారు.


