ఒక్క రోజే తనిఖీలు..
బియ్యం కొనుగోలు చేస్తున్నారా? బస్తాపై ముద్రించిన బరువును చూసి గుడ్డిగా నమ్ముతున్నారా? అయితే మీరు అప్రమత్తం కావాల్సిందే.. ఎందుకంటే మార్కెట్లో బస్తాపై 26 కిలోలని ముద్రించి.. తూకం వేస్తే అందులో 24 కిలోల బియ్యం మాత్రమే ఉంటున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఒక్కో బస్తాలో రెండు కిలోల చొప్పున బియ్యం మాయం చేస్తూ సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. అలాగే ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీని సైతం ఎగ్గొడుతున్నారు. ఇటీవల సంబంధిత అధికారుల తనిఖీల్లో అక్రమాలు బయటపడటంతో బియ్యం వ్యాపారుల తీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
– సాక్షి, సిద్దిపేట
బియ్యం దుకాణాల్లో వివిధ రకాల బ్రాండ్ల పేర్లతో బస్తాలను విక్రయిస్తున్నారు. వాటిపై 26 కిలోలుగా బరువు ముద్రించి ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో తూకం వేస్తే 24 కిలోలే ఉంటున్నట్లు తనిఖీల్లో తేలింది. ఈ నెల 2న సిద్దిపేట సమీకృత మార్కెట్ సమీపంలోని విజయదుర్గ, సిద్ధివినాయక రైస్ షాప్‌లో సివిల్ సప్లయ్, వాణిజ్య పన్నుల శాఖ, తునికల కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఒక్కో బస్తాపై రెండు కిలోల మేర తక్కువగా బియ్యం ప్యాకింగ్ చేశారని గుర్తించారు. రోజుకు పదుల సంఖ్యలో బస్తాలు విక్రయించే వ్యాపారుల వద్ద ఈ తేడాతో వినియోగదారులు పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు.
ముద్రించిన ప్రకారం బరువు తప్పనిసరి
లీగల్ మెట్రాలజీ (తూనికలు–కొలతల) నిబంధనల ప్రకారం.. ప్యాకెట్‌పై ముద్రించిన నికర బరువుకంటే తక్కువ పరిమాణంలో సరుకు అందించడం తీవ్రమైన నేరం. రూల్స్ ఉల్లంఘన కింద కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బియ్యం మిల్లులు, ప్యాకింగ్ యూనిట్లు, గోదాములు, హోల్‌సేల్ మార్కెట్లపై విస్తృత దాడులు నిర్వహించాలి.
అప్రమత్తంగా ఉండాలి
● బియ్యం బస్తా కొనుగోలు చేసే సమయంలో దుకాణదారుడి వద్దే తూకం వేయించి కచ్చితమైన బరువు ఉందో లేదో సరిచూసుకోవాలి.
● బస్తాపై ఉన్న బరువు, ధర పేర్కొన్న రశీదును తప్పనిసరిగా తీసుకోవాలి.
● తూకంలో తేడా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే తూనికలు, కొలతల శాఖ అధికారులకు లేదా వినియోగదారుల ఫోరమ్‌కు ఫిర్యాదు చేయాలి.
ఎల్‌నినో ఎఫెక్ట్‌తో బియ్యం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. బియ్యం అధిక ధరలకు విక్రయిస్తే కట్టడి చేసేందుకు జిల్లా అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో డీఎస్‌ఓ బ్రహ్మారావు, సీటీఓ వేణుగోపాల్ రెడ్డి, తునికల కొలతల అధికారి శివరంజనిలు ఉన్నారు. వీరు నిత్యం తనిఖీలు చేపట్టాలి. ఈ నెల 2న ఐదు బియ్యం షాప్‌లలో తనిఖీలు చేయగా రెండు షాప్‌లలో తూకంలో మోసం చేస్తున్నట్లు గుర్తించారు. ఒక్క రోజుతోనే తనిఖీలు సరిపెట్టడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జీఎస్టీ నిబంధనల ప్రకారం.. 25 కేజీల వరకు ఉండే ప్యాక్డ్ బియ్యం బస్తాలపై 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అదే 25 కేజీలు దాటితే (ఉదాహరణకు 26 కేజీలు లేదా అంతకంటే ఎక్కువ) జీఎస్టీ మినహాయింపు లభిస్తుంది. ఇక్కడే కొందరు వ్యాపారులు దొంగ దారిన నడుస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. బస్తాపై 26 కిలోలు అని ముద్రించడం ద్వారా ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్నారు. తీరా లోపల తూకం వేస్తే 24 కిలోలే ఉంటుండటంతో ఒకే దెబ్బకు రెండు లాభాలు పొందుతున్నారు. ఈ రకంగా పన్ను ఎగవేతతో పాటు వినియోగదారులను మోసం చేసేందుకు పక్కా వ్యూహంతోనే అక్రమాలకు పాల్పడుతున్నారా? కొనుగోలు బిల్లులపై జీఎస్టీ శాఖ ఉన్నతాధికారులు లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది.


