శివారు వెంకటాపూర్ గ్రామస్తులకు నచ్చజెప్పిన ఆర్‌డీఓ
మర్కూక్(గజ్వేల్): భూ రీ సర్వేకు వచ్చిన అధికారులకు గ్రామస్తులు సహకరించి సర్వే కొనసాగేలా చూడాలని గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళ కోరారు. మండలంలోని శివారు వెంకటాపూర్‌లో సోమవారం సర్వేకు వచ్చిన అధికారులను గ్రామస్తులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఆమె గ్రామానికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడారు. భూ రీ సర్వేతో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అన్నారు. రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించిన అనంతరం ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తారని వాటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వ భూములను గుర్తిస్తారని తెలిపారు. సర్వే సమయంలో అధికారులకు సహకరించి తమ వద్ద ఉన్న పత్రాలను చూపించాలన్నారు. వెంటనే గ్రామస్తులు సర్వేకు సహకరిస్తామని చెప్పడంతో అధికారులు ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్ గ్రామ పంచాయతీల వద్ద గ్రామస్తులకు నోటీసులు అందజేశారు. అనంతరం శివారు వెంకటాపూర్‌లో ఆబాది (ఇల్ల స్థలాలు) సర్వే నిర్వహించారు. ప్రస్తుత సర్వేలో 25 ఎకరాల 6 గుంటల గ్రామ విస్తీర్ణం కలిగి ఉందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సరిత, ఆర్‌ఐ బాలయ్య, సర్పంచ్ కనకయ్య, డీఐ వంశీ, జీపీఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు


