దుబ్బాక రచ్చకెక్కిన
గ్రూపు విభేదాలు
అధిష్టానానికి చేరిన వివాదం
అసలే నియోజకవర్గంలో అంతంతమాత్రంగానే ఉన్న కాంగ్రెస్ ఇలా మళ్లీ గ్రూపుల విభేదాలతో రచ్చకెక్కడంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించి శ్రీనివాస్‌రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డిలతో మాట్లాడటంతోపాటు అన్ని కోణాల్లో పూర్తి సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. విగ్రహాల లొల్లితో దుబ్బాక కాంగ్రెస్‌లో గ్రూపు విభేదాలు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దుబ్బాక: కాంగ్రెస్‌పార్టీలో గ్రూపుల విభేదాలకు కేరాఫ్ అడ్రస్‌గా రాష్ట్రంలోనే దుబ్బాక పేరుగాంచింది. గ్రూపు విభేదాలతోనే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలవడం కాదుకదా కనీసం డిపాజిట్ కూడా రాని పరిస్థితి నెలకొంది. గతంలో నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పన్యాల శ్రావణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ నాయకులు మద్దుల సోమేశ్వర్‌రెడ్డి తనయుడు రాష్ట్ర నాయకుడు గాల్‌రెడ్డి మధ్య గ్రూపు విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేస్థాయిలో ఉండేవి. ఎమ్మెల్యే టికెట్ శ్రీనివాస్‌రెడ్డికి ఇస్తే శ్రావణ్‌కుమార్‌రెడ్డి వ్యతిరేకంగా పనిచేయడమూ తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానం నియోజకవర్గంలో నెలకొన్న గ్రూపుల విభేదాలపై దృష్టి సారించి నియోజకవర్గ బాధ్యతలు పూర్తిగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి అప్పగించడంతో శ్రావణ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గంలో కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఏడాదిన్నరగా కొత్తగా నియోజకవర్గంలోని తొగుట మండలానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ గాడిపల్లి రఘువర్ధన్‌రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో నియోజకవర్గంలో మళ్లీ శ్రీనివాస్‌రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి గ్రూపుల లొల్లి మొదలైంది.
రచ్చకెక్కిన లొల్లి
దుబ్బాకలో తెలంగాణ ఉద్యమకాలంలో మాజీ ప్రధానమంత్రులు, కాంగ్రెస్ జాతీయ నేతలైన ఇందిరా, రాజీవ్‌గాంధీల విగ్రహాలను ధ్వంసం చేశారు. దీంతో ధ్వంసమైన విగ్రహాలను రఘువర్ధన్‌రెడ్డి తిరిగి ప్రతిష్ఠించేందకు కొత్తవిగ్రహాలను సిద్ధం చేయించారు. ఈ క్రమంలో శనివారం రఘువర్ధన్‌రెడ్డి తెచ్చిపెట్టిన రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు ఆవిష్కరించడం అలాగే తెలంగాణ తల్లి చౌరస్తాలో తాళ్లతో కట్టించిన ఇందిరాగాంధీ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించడం రెండు వర్గాల మధ్యన తీవ్ర వివాదానికి తెరలేపింది. తమకు తెలియకుండా ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఎత్తుకుపోయారంటూ రఘువర్ధన్‌రెడ్డి శనివారం పోలీస్‌స్టేషన్‌లో శ్రీనివాస్‌రెడ్డితోపాటు పలువురు నేతలపై ఫిర్యాదు చేశారు. విగ్రహాన్ని తమకు సమాచారం లేకుండా ఎత్తుకెళ్లిన వారిపై కేసు నమోదు చేయాలంటూ రఘువర్ధన్‌రెడ్డి రాత్రి 10.30 గంటల వరకు అక్కడే ఉండటంతో పోలీస్‌లకు తలనొప్పిగా మారింది. పోలీసుల జోక్యంతో ఇందిరాగాంధీ విగ్రహాన్ని యథావిధిగా తెలంగాణ తల్లి చౌరస్తాకు శ్రీనివాస్‌రెడ్డి వర్గం తీసుకొచ్చి పెట్టారు.
పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న కాంగ్రెస్ పంచాయితీ
నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీనివాస్‌రెడ్డి వర్గంపై రఘువర్ధన్‌రెడ్డి ఫిర్యాదు
చర్చనీయాంశంగా మారిన గ్రూపు తగాదాలు.. అధిష్టానం సీరియస్


