బల్దియాకు దిక్కెవరు? | - | Sakshi
Sakshi News home page

బల్దియాకు దిక్కెవరు?

Oct 3 2026 7:18 AM | Updated on Oct 3 2026 7:18 AM

సిద్దిపేట మున్సిపాలిటీకి పాలకవర్గం లేదు..కమిషనరూ లేరు

● నాలుగు నెలలుగా ఇన్‌చార్జిల పాలనలోనే..

● అధికారులు లేకపోవడంతో సమస్యలతో సతమతం

సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట మున్సిపాలిటీకి ఒకవైపు పాలకవర్గం లేదు. మరోవైపు మున్సిపల్‌ కమిషనర్‌ను ప్రభుత్వం నియమించలేదు. జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్‌, హుస్నాబాద్‌, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలున్నాయి. పురపాలికల్లో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. దాదాపు చాలా మున్సిపాలిటీల్లో కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పట్టణాల్లో అధికారుల పర్యవేక్షణ లేక వివిధ చోట్ల ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. మరోవైపు సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కీలక విభాగాలకు పూర్తిస్థాయి అధికారులను నియమిస్తేనే పాలన గాడిలో పడే అవకాశముంది.

60% పోస్టులు ఖాళీలు

జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో 115 మున్సిపల్‌ వార్డులున్నాయి. సిద్దిపేటలో 43, గజ్వేల్‌ 20, దుబ్బాక 20, చేర్యాల 12, హుస్నాబాద్‌లో 20 వార్డులున్నాయి. ఈ ఐదు మున్సిపాలిటీల్లో 421 పోస్టులు మంజూరు ఉండగా 168 మందే విధులు నిర్వర్తిస్తుండగా 253(60.10%) పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

నాలుగు నెలలుగా ఇన్‌చార్జి పాలన

తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు సిద్దిపేట మున్సిపల్‌ అప్పటి కమిషనర్‌ అశ్రిత్‌ కుమార్‌ను సీడీఎంఏ సస్పెండ్‌ చేసింది. దీంతో జూన్‌ 4న హుస్నాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున్‌కు అదనపు బాధ్యతలను అప్పగించారు. మే 6వ తేదీతో మున్సిపాలిటీ పాలకవర్గం పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారి పాలనలో కొనసాగుతోంది. 43 వార్డులుండగా 23వాటికి మాత్రమే వార్డు అధికారులుండగా మిగతా 20 వార్డులకు ఇన్‌చార్జిలను వివిధ అధికారులను నియమించారు. సెకండ్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా కొనసాగుతున్న సిద్దిపేట మున్సిపాలిటీకి ఈఈ పోస్టు మంజూరు కాలేదు. ఇన్‌చార్జిల పాలనలో కొనసాగుతుండటంతో పర్యవేక్షణ కరువవుతోంది. గజ్వేల్‌లో 20 వార్డుల్లో ఐదు వార్డుల్లోనే పూర్తిస్థాయిలో వార్డు అధికారులుండగా 15 వార్డుల్లో ఇన్‌చార్జి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మహేశ్‌ ఏఈగా చేర్యాల, గజ్వేల్‌, రామాయంపేటల్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. దీంతో ఒక్కో మున్సిపాలిటీలో రెండు రోజుల చొప్పున విధులు నిర్వర్తిస్తున్నారు. సంధ్య టీపీఓగా హుస్నాబాద్‌, చేర్యాలలో చేస్తుండగా ఒక్కో మున్సిపాలిటీలో వారంలో మూడు రోజుల పాటు విధులు నిర్వర్తిస్తున్నారు.

సమస్యలతో సతమతం

పురపాలికలలో పూర్తిస్థాయిలో సిబ్బంది, అధికారులు లేకపోవడంతో సమస్యల పరిష్కారం కావడం లేదు. దీంతో సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఆరోగ్య కార్యక్రమాల పర్యవేక్షణ, అంటువ్యాధులు, దోమల నివారణ చర్యలు కుంటుపడుతున్నాయి. ఆస్తి పన్ను సహా పలు రకాల పన్ను వసూళ్లు మందగిస్తున్నాయి. వివిధ రకాల సిబ్బంది లేకపోవడంతో సేవల్లో జాప్యం జరుగుతోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తిస్థాయిలో అధికారులు, సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement