సిద్దిపేటకమాన్: జాతిపిత గాంధీ చూపిన శాంతి మార్గమే నేటి సమాజానికి సన్మార్గమని ఇప్పుడది ఎంతో అవసరమని ఒకటవ జిల్లా అదనపు న్యాయమూర్తి జయప్రసాద్ పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి జయప్రసాద్ మాట్లాడుతూ..గాంధీజీ సత్యం, అహింస సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించడంతోపాటు చట్టాన్ని గౌరవించాలన్నారు. మనిషిలోని ఆశ, ఆవేశాలను అదుపులో పెట్టుకుంటే నేరాల శాతం తగ్గిపోతుందని తెలిపారు. జిల్లా జైలు సూపరింటెండెంట్ జి.రత్నం మాట్లాడుతూ..జైలు అనేది శిక్ష అనుభవించే కారాగారంగా కాకుండా నేరస్థుడిలో నేర ప్రవృత్తిని తొలగించే కర్మాగారాలుగా మారాయన్నారు. మత్తు పదార్థాలకు బానిసైన వారిలో మార్పు కోసం డీ అడిక్షన్ సెంటర్లు, ఆర్థిక అవసరాల కోసం ఫ్యాక్టరీలు, పునరావాసం కోసం పెట్రోల్ బంకులు, ఉచిత న్యాయ సహాయానికి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కౌన్సిల్‌లు ఉన్నాయని తెలిపారు. అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్ మాట్లాడుతూ..గాంధీ జీవితం యావత్ ప్రపంచానికి ఆదర్శమని, ఆయన చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. కార్యక్రమంలో ఖైదీలకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. అంతకుముందు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో న్యాయమూర్తి కుమారస్వామి పాల్గొని ఖైదీలకు పలు సూచనలు చేశారు. ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ మురళీకృష్ణ, డిప్యూటీ జైలర్ వికాస్, ఇజాజ్, ఖైదీలు తదితరులు పాల్గొన్నారు.
ఒకటవ జిల్లా అదనపు న్యాయమూర్తి జయప్రసాద్
జిల్లా జైలులో ఘనంగా ఖైదీల సంక్షేమ దినోత్సవం


