నేటి నుంచి ప్రత్యేక కార్యక్రమాలు
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధ నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రంలో శ్రావణ శుద్ధ దశమి శనివారం నుంచి నాలుగు రోజులపాటు పవిత్రోత్సవాలు జరుగుతాయని ఆలయ ఈఓ రంగాచారి తెలిపారు. శనివారం సాయంత్రం 6.30 గంటలకు మృత్సంగ్రహణం, అంకురార్పణ, ఆదివారం ఉదయం 8.30 గంటలకు అగ్ని ప్రతిష్ఠ, మూర్తి కుంభస్థాపన, పవిత్ర అధివాసం, మూలమంత్ర హోమం, ద్రావిడ ప్రబంధ పారాయణం జరుగుతాయి. సోమవారం ఉదయం మూలమంత్ర హవనం, ద్రావిడ ప్రబంధ పారాయణం, మంగళవారం ఉద యం 8.30 గంటలకు హోమం, మహాపూర్ణాహుతి పూజలు జరుగుతాయన్నారు. పవిత్రోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించాలని కోరారు.
భయాందోళనలో ప్రజలు
దుబ్బాక: పట్టణంలోని 14వ వార్డులో ఓ మహిళ డెంగీ బారిన పడింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న మహిళకు పరీక్షల్లో డెంగీ నిర్ధారణ కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీంతో అప్రమత్తమైన కౌన్సిలర్ తునికి సురేష్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ పీహెచ్‌సీ వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది ఆ కాలనీలో ముందు జాగ్రత్త చర్యగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కాగా మహిళకు డెంగీ బారిన పడటంతో కాలనీలోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
జిల్లా సంక్షేమ అధికారి శారద
దుబ్బాక: అంగన్వాడీ కేంద్రాల్లో ఉపాధ్యాయులు, ఆయాల నియామకాలను పారదర్శకంగా చేపడుతున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి శారద తెలిపారు. శుక్రవారం దుబ్బాక ఐసీడీఎస్ కార్యాలయంలో ధ్రువ పత్రాల పరిశీలన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 78 టీచర్స్ పోస్టులకు 1999 దరఖాస్తులు.. 13 ఆయా పోస్టులకు 62 వచ్చాయన్నారు. ఈ నెల 31 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపడతామన్నారు.
కొమురవెల్లి(సిద్దిపేట): స్థానిక రైల్వేస్టేషన్‌ను దక్షిణమధ్య రైల్వే వైద్యాధికారుల బృందం డాక్టర్ శారద ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రారంభించిన రైల్వేస్టేషన్‌లో వీల్ చైర్, స్ట్రెచర్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు లేవని గుర్తించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని రైల్వే ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. అలాగే స్టేషన్‌లోని తాగునీటి శాంపిల్స్ ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు.
సిద్దిపేటఎడ్యుకేషన్: జిజ్ఞాస రాష్ట్రస్థాయి పోటీల్లో సిద్దిపేట ప్రభుత్వ మహిళాడిగ్రీ కళాశాల నుంచి ఫిజిక్స్, ఇంగ్లిష్, తెలుగు, చరిత్ర విద్యార్థినుల బృందాలు పాల్గొని తమ స్టడి ప్రాజెక్టులను వివరించారు. శుక్రవారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీవన్‌కుమార్ పర్యవేక్షక అధ్యాపకులతో పాటు విద్యార్థినులను అభినందించారు. కళాశాల నుంచి నాలుగు బృందాలు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనడం గొప్ప విషయమన్నారు. విద్యార్థులు సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.


