ఆదమరిస్తే ఆస్పత్రికే..
● రోడ్డుపైనే ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్
● ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు
చిన్నకోడూరు(సిద్దిపేట): భారీ వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. నిబంధనల తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగ వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల నిత్యం ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతోంది. కరీంనగర్– హైదరాబాద్ రాజీవ్ రహదారిపై మండల పరిధిలోని అనంతసాగర్, చర్లఅంకిరెడ్డిపల్లి, మల్లారం, ఇబ్రహీంనగర్, మందపల్లి తదితర గ్రామాల సమీపంలో వాహనాలు రోడ్డుకు ఆనుకుని నిలుపుతున్నారు. ఈ రహదారిపై 24 గంటలు వాహనాల రద్దీ ఉంటోంది. వాహనాలు మరమ్మతులకు గురైతే కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పక్కనే నిలిపేస్తున్నారు. వెనుక నుంచి వచ్చే వాహనదారులు ముందున్న వాహనం కనిపించకపోవడంతో నేరుగా వెళ్లి ఢీకొంటున్నారు. రాజీవ్ రహదారిపై తరుచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.
రాజీవ్ రహదారిపై ..
రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న హోటళ్ల సమీపంలో పార్కింగ్ స్థలాన్ని దాటి వాహనాలను రోడ్డుపైనే ఇష్టానుసారంగా నిలుపుతున్నారు. ఇవి వాహనదారుల ప్రాణాలు తీస్తున్నాయి. ఎలాంటి హెచ్చరిక, రేడియం బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. వేగంగా వచ్చే వాహనాలు డ్రైవర్లకు ముందున్న వాహనం నిలిపి ఉందా లేక ప్రయాణిస్తుందా తెలియక గందరగోళానికి గురవుతున్నారు. నిత్యం ప్రమాదాలు జరగడంతో పోలీసులు, సంబంధిత అధికారులు దృష్టి సారించి ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
గతంలో ఇలా..
● కరీంనగర్‌లో పరీక్షలు రాసి వస్తున్న విద్యార్థులు ప్రైవేటు వాహనంలో సిద్దిపేట తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో అనంతసాగర్ వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని ఢీకొంది. ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇలాంటి సంఘటన నిత్యం జరుగుతూనే ఉన్నాయి.
చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ బీసీ కాలనీలో డ్రైనేజీ పైకప్పు ధ్వంసమై ప్రమాదకరంగా మారింది. ఏ మాత్రం ఆదమరిచినా ఆస్పత్రికి వెళ్లాల్సిందే. డ్రైనేజీ పై కప్పు ధ్వంసమై ఏడాది గడుస్తున్నా పట్టించుకునే వారే లేరు. నిత్యం కాలనీ వాసులు ప్రమాదాలకు గురవుతున్నారని, అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.


