ప్రొటోకాల్ వివాదం
వెనుదిరిగిన కలెక్టర్
●కొమురవెల్లిపుణ్యక్షేత్రం రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రులు ●హర్షం వ్యక్తం చేసిన భక్తులు
కొమురవెల్లి(సిద్దిపేట): ఎన్నో ఏళ్ల నుంచి మల్లన్న భక్తుల కలగా మిగిలిన కొమురవెల్లి రైల్వే స్టేషన్ ఆశను ప్రధాని మోదీ నెరవేర్చారని కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ పేర్కొన్నారు. కొమురవెల్లి మల్లికార్జున ఆలయ సమీపంలో కొత్తపల్లి–మనోహరబాద్ రైల్వే లైన్లో నూతనంగా నిర్మించిన కొమురవెల్లిపుణ్య క్షేత్రం రైల్వే స్టేషన్‌ను కేంద్రమంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో కలసి ఆదివారం ప్రారంభించారు. అంతకుముందు కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ...గతంలో రైల్వే స్టేషన్ నిర్మించాలన్న, నూతన రైల్వే లైను ఏర్పాటు చేయాలన్న దశాబ్దాల సమయం పట్టేదని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయడం ఒక చారిత్రక ఘట్టమని, స్టేషన్ నిర్మాణం కోసం భూమి పూజచేసిన రెండేళ్లలలోనే పూర్తిచేసి భక్తులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. హైదరబాద్ నుంచి కొమురవెల్లికి కేవలం రూ.20లతో చేరుకోవచ్చని ప్రస్తుతం డీజిల్‌తో నడుస్తున్న ఈ లైన్‌ను తర్వలోనే రూ.300కోట్లతో విద్యుద్దీకరణ చేయనున్నట్లు వెల్లడించారు. మోధీ ప్రభుత్వ సమయం ముగిసేసరికి కొత్తపల్లి నుంచి మనోహరబాద్ రైల్వే పనులు పూర్తవుతాయని, తెలంగాణ అభివృద్ది పట్ల ప్రధాని మోదీ చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు. అనంతరం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పని చేయాలన్నారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రం మరింత ప్రాముఖ్యత సాధించాలని, దానికోసం ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీంలో చేర్చాలని కోరారు. కొత్తపల్లి– మనోహరబాద్ రైల్వే లైన్ మల్టిపుల్ లైన్స్ ఏర్పాటు చేస్తే ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో రైల్వే లైన్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కొత్తపల్లి– మనోహరబాద్ రైల్వే లైన్ ఏర్పాటుకు మాజీ సీఎం కేసీఆర్ కృషి ఫలించిందన్నారు. ఈ రైల్వే లైన్ ఏర్పాటుకు గత ప్రభుత్వం 50% నిధులు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. స్టేషన్ ప్రారంభోత్సవానికి ప్రజలు భారీ సంఖ్యలో హజరయ్యారు. అనంతరం నాయకులు రైలును స్టేషన్ జెండా ఊపి ప్రారంభించి రైలులో ప్రయాణించారు. కార్యక్రమంలో రాజ్యసభ్యులు కె.లక్ష్మణ్, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవత్సవ,రైల్వే అధికారులు, స్థానిక బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
రైల్వేస్టేషన్ ప్రారంభోత్సం రసాభాసగా మారింది. స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి తగిన ప్రాధాన్యతనివ్వడంలేదని, ప్రొటోకాల్ పాటించడంలేదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. జై పల్లా అంటూ నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావారణం నెలకొంది. పోలీసులు కల్పించుకుని వారిని శాంతింపజేశారు.
రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు జిల్లా కలెక్టర్ హైమావతి కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ ఆమేరకు రైల్వే అధికారులు ప్రొటోకాల్ ఇవ్వలేదని వెంటనే వెనుదిరిగారు.


