సిద్దిపేటఎడ్యుకేషన్: తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్(టీజీసీజీటీఏ) సిద్దిపేట జిల్లా కార్యవర్గం ఎన్నికలు స్థానిక ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. అధ్యక్షుడిగా డాక్టర్ శ్యాంసుందర్, ప్రధానకార్యదర్శిగా డాక్టర్ పిట్లదాసు, కోశాధికారిగా డాక్టర్ సీహెచ్.మధుసూదన్, ఉపాధ్యక్షుడిగా డాక్టర్ శ్రీలత ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శ్యాంసుందర్ మాట్లాడుతూ...అధ్యాపకుల సమస్యలను పరిష్కారానికి తమ శాయశక్తులా కృషి చేస్తామన్నారు. రాష్ట్ర కార్యవర్గానికి జిల్లా అధ్యాపకులకు అనుసంధానకర్తలుగా ఉండి అధ్యాపకుల ప్రయోజనాలను కాపాడుతామని చెప్పారు. తమను ఎన్నుకున్న జిల్లాలోని అధ్యాపకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆయా కళాశాలల యూనిట్ బాధ్యులు ఉమామహేశ్వరీ, పవన్‌కుమార్, సత్యనారాయణరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, ప్రొఫెసర్ అయోధ్యరెడ్డి, మట్టా సంపత్‌కుమార్‌రెడ్డి, స్రవంతి, శ్రీలత, బాలచంద్రం తదితరులు పాల్గొన్నారు.
పీఆర్‌సీని అమలు చేయాలి
టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్
అధ్యక్షుడు తిరుపతిరెడ్డి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్‌సీని అమలు చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా కేంద్రంలోని ఉపాధ్యాయ భవన్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పీఆర్‌సీ నివేదిక వెంటనే తెప్పించుకుని 40% ఫిట్‌మెంట్‌తో వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు 2023 జూలై నుంచి అమలు చేయాల్సిన నూతన పీఆర్‌సీని ఆర్థిక ఇబ్బందులు సాకుతో వాయిదా వేయడం సరికాదన్నారు. ప్రభుత్వం 27 వేల పాఠశాలలను 4 వేల పాఠశాలలకు కుదించాలనే నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో విజేందర్‌రెడ్డి, కనకయ్య పాల్గొన్నారు.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సిద్దిపేటలో ఆదివారం మధ్యాహ్నం ఓ మోస్తారు వర్షం కురిసింది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఈదురుగాలులు వీచి వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నారాయణఖేడ్: ఖేడ్ మండలం జూకల్ శివారులోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో ఇంటర్‌లో వివిధ కోర్సుల్లో ఉన్న ఖాళీలకు ఈనెల 28న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసచారి తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీలో 15, బైపీసీలో 15 సీట్ల చొప్పున ఖాళీలు ఉన్నాయన్నారు. ఈ ఖాళీ సీట్లను జోనల్ అధికారి ఉత్తర్వుల మేరకు నేరుగా భర్తీ చేస్తామన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు ఒరిజనల్ ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.
శివ్వంపేట(నర్సాపూర్): చెరువు మట్టి అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులు గ్రామ పెద్దమనుషుల వద్ద ఉంచగా, వాటికి సంబంధించిన లెక్కలు తేలకపోవడంతో గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధి సికింద్లాపూర్‌లో మూడేళ్ల క్రితం చెరువు మట్టి అమ్మకం ద్వారా గ్రామానికి రూ.16 లక్షల ఆదాయం సమకూరింది. వాటిని గ్రామ అవసరాల కోసం ఖర్చు చేసేందుకు గ్రామానికి చెందిన పలువురు పెద్ద మనుషుల వద్ద ఉంచారు. ప్రస్తుతం ఆ డబ్బులను గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేయాలని అడిగితే వారు బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రజా అవసరాల కోసం ఖర్చు చేయాల్సిన డబ్బులు సొంతానికి వాడుకోవడం ఎంతవరకు సమంజమని ప్రశ్నిస్తున్నారు.


