పాత యూనిఫాంతోనే పాఠశాలకు
నూతన విద్యాసంవత్సరం ప్రారంభమై 40 రోజులు కావొస్తున్నా ఇంతవరకు విద్యార్థులకు కొత్త యూనిఫాంలు అందలేదు. దీంతో విద్యార్థులు గతేడాదిలో వాడిన యూనిఫాంలనే ధరించి బడులకు వస్తున్నారు. కనీసం జెండా పండుగ నాటికై నా కొత్త యూనిఫాంలు అందుతాయేమోనని పిల్లలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాలో 980 పాఠశాలల పరిధిలో 73 వేలమంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. దీంతో వీరికి ప్రతీ ఏటా 4.09లక్షల మీటర్ల వస్త్రం అవసరం ఉంటుంది. అయిన నేటివరకు జిల్లాకు వస్త్రం చేరుకోలేదు. దీంతో విద్యార్థులు పాత యూనిఫాంలతో బడికి వస్తూ తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పాఠశాలలకు యూనిఫాంలతో రావడం తప్పనిసరి కావడంతో విద్యార్థులు చినుగుల్ని కుట్టుకుని పాఠశాలలకు వస్తున్నారు. ప్రతీ విద్యా సంవత్సరం ప్రారంభం నాడు విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు అందిస్తారు. రెండు జతల చొప్పున మొత్తం విద్యార్థులకు 1.46లక్షలు యూనిఫాంలు అవసరమవుతాయి.
మార్పులతోనే ఆలస్యమా?
ప్రతీ విద్యాసంవత్సరం ఒకే విధమైన యూనిఫాం ఉండటంతో విద్యార్థులకు సరిపడా వస్త్రాన్ని త్వరగా పంపించే వారు. కానీ ఈ విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు వివిధ రంగులతో కూడిన యూనిఫాంలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతోనే నూతన వస్త్రం వచ్చేందుకు సమయం పడుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
కనీసం నెల రోజుల సమయం
జిల్లాకు ఇప్పుడు వస్త్రం వచ్చిన మహిళ సంఘాలకు కుట్టడం కోసం ఇస్తారు. మహిళ సంఘాల సభ్యులు యూనిఫాంలు కుట్టడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుంది. దీంతో ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవానికి విద్యార్థులు పాత దుస్తులతోనే పాఠఽశాలలకు రావాల్సిందే.
ఇబ్బందులు పడుతున్న 73వేల మంది విద్యార్థులు
జెండా పండుగకై నా అందేనా?
4.09లక్షల మీటర్లు అవసరం


